: బరితెగించిన ఇసుక మాఫియా... ఉడుపి కలెక్టర్ ప్రియాంక, అసిస్టెంట్ కలెక్టర్ శిల్పాలపై హత్యాయత్నం

కర్ణాటకలో ఇసుక మాఫియా బరితెగించింది. ఉడుపి జిల్లా కుందాపుర సమీపంలోని వారాహి నదిలో జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలను పరిశీలించేందుకు వెళ్లిన కలెక్టర్ ప్రియాంక మేరీ ఫ్రాన్సిస్, కుందాపుర అసిస్టెంట్ కలెక్టర్ శిల్పా నాగ్ లపై సుమారు 50 మంది మారణాయుధాలతో వచ్చి దాడి చేశారు. ప్రియాంకతో పాటు శిల్పానాగ్, ఆమె భర్త శంకరలింగ, గన్ మెన్ పృథ్విరాజ్, ఓ విలేజ్ అకౌంటెంట్లు రాత్రి 11:30 గంటల సమయంలో వారాహి నది వద్దకు వెళ్లగా, తొలుత 20 మంది బైకులపై వచ్చి అడ్డుకోవాలని చూశారు. అయినా అధికారులు ముందుకు వెళ్లడంతో, వీరిని చుట్టుముట్టిన యూపీ, బీహార్ వ్యక్తులు కొందరు దాడికి దిగారు.

ఈలోగా పోలీసులకు కలెక్టర్ ఫోన్ చేయడం, స్థానికులు వస్తుండటం చూసిన వీరంతా పారిపోయారు. గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు ఏడుగురిని అరెస్ట్ చేశారు. ఈ ప్రాంతంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు కండ్లూరి సమీపంలో షెడ్లను ఏర్పాటు చేసుకుని అక్రమంగా ఇసుక దందాను సాగిస్తున్నారని, అడ్డుకోవాలని చూసిన తమపై హత్యాయత్నానికి దిగారని ఏసీ శిల్పా నాగ్ తెలిపారు. అక్రమ ఇసుక దందాపై తానే స్వయంగా దాడులకు వస్తానని కలెక్టర్ చెప్పడంతోనే, తాము ఇక్కడికి వచ్చామని, సకాలంలో పోలీసులు, స్థానికులు స్పందించారని వివరించారు.

More Telugu News