: విఫలమైన చర్చలు.. 8 నుంచి లారీల దేశవ్యాప్త సమ్మె.. నిత్యావసరాలపై ప్రభావం

గత ఐదు రోజులుగా కొనసాగుతున్న సమ్మెను మరింత ఉద్ధృతం చేయాలని దక్షిణాది రాష్ట్రాల లారీ యజమానుల సంఘం, తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్  నిర్ణయించాయి. లారీ యాజమాన్య సంఘాలతో బీమా నియంత్రణ, అభివృద్థి సంస్థ సోమవారం హైదరాబాద్‌లోని పరిశ్రమల భవన్ ఐఆర్‌డీఏ కార్యాలయంలో జరిగిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో ఈనెల 8 నుంచి దేశవ్యాప్తంగా సమ్మె చేపట్టాలని నిర్ణయించాయి. ప్రైవేటు బీమా సంస్థల ప్రయోజనాల కోసం వాహనాలపై బీమా మొత్తాన్ని ఏకంగా 41 శాతం పెంచారని ఆరోపిస్తున్న లారీ సంఘాలు పెంచిన బీమాను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.

సోమవారం జరిగిన చర్చల సందర్భంగా లారీ సంఘాల డిమాండ్‌పై ఓ కమిటీని నియమిస్తామని ఐఆర్‌డీఏ చైర్మన్ విజయన్ పేర్కొన్నారు. దీనికి ఓకే అన్న లారీ  సంఘాలు అప్పటి వరకు బీమా పెంపును నిలిపివేయాలని కోరాయి. అయితే పెంపు ఇప్పటికే అమల్లోకి వచ్చినందున అది సాధ్యం కాదని విజయన్ చెప్పడంతో లారీ సంఘాల ప్రతినిధులు చర్చలను బహిష్కరించి బయటకు వచ్చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇప్పటి వరకు దక్షిణాది రాష్ట్రాలకే పరిమితమైన సమ్మెను ‘చక్రా బంద్’ పేరుతో దేశవ్యాప్తంగా విస్తరిస్తామని తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి హెచ్చరించారు.  ఆరో తేదీ నుంచి నిత్యావసరాలైన  పాలు, నీళ్లు, కూరగాయలు, మందులు, పెట్రోల్, డీజిల్‌ వంటి వస్తువుల రవాణాను కూడా నిలిపివేయనున్నట్లు తెలిపారు. కాగా, లారీల సమ్మె ప్రభావం ఇప్పటికే నిత్యావసరాలపై పడింది. హోల్‌సేల్ ధరల్లో 15శాతం వరకు ధరల పెరుగుదల కనిపించింది.

More Telugu News