: అప్పట్లో 'ఉత్తమ నటి' అవార్డు అందుకున్న జయప్రకాష్ రెడ్డి!

ప్రముఖ సినీ నటుడు జయప్రకాష్ రెడ్డి తన కాలేజీ రోజుల నాటి విషయాలను తాజాగా ముచ్చటించారు . '‘1961లో గుంటూరులోని ఆంధ్రా క్రిస్టియన్ కళాశాలలో నన్ను మా నాన్నగారు చేర్చారు. అక్కడే హాస్టల్ లో ఉంచారు. అదే సంవత్సరం, రంగస్థలం ఎక్కాను. మొట్టమొదటి సారిగా ఒక ఆడ వేషంలో నటించాను. ముగ్గురు మగ పిల్లలు ఆడ వేషాల్లో నటించాము. దాని రిజల్ట్స్ చూద్దామని చెప్పి కాలేజీ నోటీస్ బోర్డు వద్దకు వెళ్లాను. ‘ఉత్తమ నటి - జయప్రకాష్ రెడ్డి’ అని రాసి ఉంది. అదే నా మొదటి ప్లే, మొదటి అవార్డు. మా నాన్న గారు కూడా నటుడే. నటన అనేది పుట్టుకతోనే వస్తుంది. అది సహజంగా వచ్చేది. అది ఉన్న వాళ్లే బాగా చేస్తారు, రాణిస్తారు. అయితే, కొంత మంది కృషి చేసి కూడా అవుతారు" అన్నారు జేపీ.

తర్వాత మళ్లీ చెబుతూ "నేను చాలా చిత్రాల్లో నటించినప్పటికీ, ‘ప్రేమించుకుందాం రా’ చిత్రంతో వీడొక ఆర్టిస్టు ఉన్నాడని గుర్తించారు. ఈ చిత్రంలో నా పాత్ర కు ఏదో ప్రత్యేకత ఉండాలని దర్శకుడు జయంత్, నిర్మాత సురేష్ బాబు, రచయిత పరుచూరి వెంకటేశ్వర రావు చెప్పారు. దీంతో, రాయలసీమ స్లాంగ్ లో మాట్లాడాను. రాయలసీమ పదజాలం నాకు బాగా తెలిసినప్పటికీ, ఇంకా తెలుసుకునేందుకు కొన్ని రోజులు ఆ ప్రాంతానికి వెళ్లొస్తానని వాళ్లకు చెప్పాను. నంద్యాలలో ఒక రూమ్ తీసుకుని వారం పది రోజులు ఉన్నాను. పొద్దునే లేచి అక్కడి పల్లెటూర్లకు వెళ్లిపోయేవాడిని. నా బొడ్డులో ఒక టేప్ రికార్డర్ ను తగిలించుకుని  అక్కడి టీ షాపులు, ఎరువుల షాపులు, సెంటర్లలో వాళ్లు మాట్లాడే భాషను రికార్డు చేసుకునే వాడిని. రాత్రికి రూమ్ కు చేరుకుని, వాళ్లు ఏ విధంగా మాట్లాడారో టేప్ రికార్డులో విని.. నోట్స్ తయారు చేసుకునే వాడిని’' అంటూ నాటి విషయాలను జయ ప్రకాష్ రెడ్డి చెప్పుకొచ్చారు.

More Telugu News