: తీవ్ర ప్రభావం పడుతుంది: జియో ఆఫర్లపై 'బాడీ కోయ్' ఆందోళన

రిల‌యన్స్ జియో త‌మ వినియోగ‌దారుల ముందు కురిపిస్తోన్న ఆఫ‌ర్ల ధాటికి మిగ‌తా టెలికాం కంపెనీలు తీవ్ర క‌ష్టాలు ఎదుర్కుంటున్న‌ విష‌యం తెలిసిందే. మొద‌ట వెల్‌కం ఆఫ‌ర్‌, ఆ త‌రువాత హ్యాపీ న్యూ ఇయ‌ర్ ఆఫ‌ర్‌, తాజాగా ప్రైమ్ ఆఫర్ మరో 15 రోజులు పొడిగింపు, రూ.303తో మరో మూడు నెలలు ఉచిత ఆఫర్లు ప్ర‌క‌టించి జియో సంచ‌ల‌నం క‌లిగిస్తోంది. జియో ప్ర‌క‌టించిన తాజా ఆఫ‌ర్‌పై సెల్యులార్ ఆపరేటర్ బాడీ కోయ్ ఆందోళన వ్యక్తం చేసింది. జియో అందిస్తున్న ఛార్జీలు ఇండస్ట్రీని అంతలాకుతలం చేస్తాయని పేర్కొంది.

ఈ ప్రభావం టెలికాం ఇండస్ట్రీలో అసోసియేట్ అయ్యే బ్యాంకులపై, ఇతరులపై అధికంగా ఉంద‌ని తెలిపింది. ఇటువంటి తక్కువ ధరలతో సేవ‌లు అందించడం వినియోగ‌దారుల‌కు మంచిదే కానీ, అవి టారిఫ్ నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయో లేదోననేదే పెద్ద ప్రశ్నగా మారిందని పేర్కొంది. ఈ విషయాన్ని న్యాయ‌స్థానాలు, టెలికాం ట్రిబ్యునలే తేల్చాల్సి ఉందని తెలిపింది. టెలికాం రంగం రూ.4.60 లక్షల కోట్లు వివిధ ఫైనాన్షియల్ ఇన్ స్టిట్యూషన్లకు, బ్యాంకులకు రుణపడి ఉందని, ఇప్పుడు జియో ప్రస్తుతం అందిస్తున్న ఈ ధరలు ఈ ప‌రిశ్ర‌మ‌ను దెబ్బతీయనున్నాయని తెలిపింది. ప్రభుత్వానికి చెల్లించే లైసెన్సు ఫీజులు, స్పెక్ట్రమ్ పేమెంట్లు, బ్యాంకుల రుణాల విషయంలో ఈ ప్ర‌భావం తీవ్రంగా ఉంటుంద‌ని ఆ సంస్థ ప్ర‌తినిధులు హెచ్చ‌రించారు.

More Telugu News