: ‘ఏనాడో సంకరం అయిపోయింది’ అన్నట్టుగా పార్టీ పరిస్థితి ఉంది: గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆవేదన

టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవికి ఆ పార్టీ సీనియర్ నేత, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజీనామా చేశారు. ఒక న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘ఇది ఈ రోజుది కాదు. దాదాపు ఏడాది నుంచి నాలో రగులుతున్న ఆవేదనకు ప్రతిరూపం ఇది. సంవత్సర కాలంగా పార్టీలో జరుగుతున్న పరిణామాలను చూస్తున్నాను. పార్టీ కోసం లక్షలాది మంది కార్యకర్తలు కష్టపడ్డారు. వారి మనోభావాలు దెబ్బతిన్నట్టు మాకు తెలుస్తోంది.

పార్టీ కోసం జిల్లాల్లో ఎవరైతే కష్టపడి పనిచేస్తున్నారో వాళ్లే అణగదొక్కబడుతున్నారు. అవతలి పార్టీల నుంచి టీడీపీలోకి వచ్చిన వాళ్లు.. మా పార్టీ కార్యకర్తలను ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో చూస్తున్నాను. కార్యకర్తల ఆవేదనను అర్థం చేసుకున్నాను. ఈ రోజుకు కూడా పార్టీలో పని చేసిన వాళ్లను పక్కన పెట్టి, 2014 ఎన్నికల్లో మా పార్టీకి వ్యతిరేకంగా పని చేసిన వాళ్లకు పదవులు ఇస్తున్నారు.... పార్టీ కోసం నేను ఎన్నో త్యాగాలు చేశాను. నాకు మంత్రి పదవి ఇచ్చినా, ఇవ్వకపోయినా నేనేమి పట్టించుకోను. పదవి కోసం నేను ఈ విధంగా మాట్లాడటం లేదు. అసలు, ఈ విధానాలు ఏంటా? అని అడుగుతున్నాను.

ఫిరాయింపుదారుల సహకారం లేకుండానే గతంలో మనం అధికారంలోకి వచ్చాము కదా, మరి, ఈ రోజున కాంగ్రెస్ పార్టీ నుంచో, వైఎస్సార్సీపీ నుంచో వచ్చిన వాళ్లను అందలమెక్కిస్తుంటే, మొదటి నుంచి టీడీపీలో ఉన్న వాళ్లు బలైపోతున్నారు. ఈ సందర్భంగా టీడీపీ వ్యవస్థాపకుడు అన్న గారి చిత్రంలోని ఓ డైలాగ్ గుర్తుకు వస్తోంది. ‘ఏనాడో సంకరం అయిపోయింది’ అన్నట్టుగా పార్టీ పరిస్థితి ఉంది. టీడీపీలోని ఎమ్మెల్యేలు ఈ రోజున ఎందుకు ఆవేదన చెందుతున్నారు?...ఇటువంటి పరిస్థితుల్లో మా లాంటి సీనియర్లు కూడా మాట్లాడకపోతే ఎలా?...టీడీపీ మూల సిద్ధాంతానికే వ్యతిరేకంగా వెళుతున్నారు. అందుకే, పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేశాను’ అంటూ పార్టీలో సీనియర్ మోస్ట్ నేత బుచ్చయ్య చౌదరి చెప్పుకొచ్చారు.

More Telugu News