: ఇస్లామాబాద్ ఎయిర్ పోర్టుకు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ పేరు... పప్పులో కాలేసిన పాక్ మాజీ మంత్రి రెహమాన్ మాలిక్

పాకిస్థాన్ మాజీ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి రెహమాన్ మాలిక్ ఏప్రిల్ ఫూల్ అయ్యారు. ఇస్లామాబాద్ కొత్త ఎయిర్ పోర్టుకు చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ పేరును పెడుతున్నారని వచ్చిన ఓ తప్పుడు వార్తా కథనంపై ఆయన స్పందించి పప్పులో కాలేసి, సామాజిక మాధ్యమాల్లో ఫూల్ గా మారారు. ఏప్రిల్ ఫూల్స్ డే సందర్భంగా, ఓ కథనాన్ని తన వెబ్ సైట్లో 'ఎక్స్ ప్రెస్ ట్రిబ్యూన్' ప్రచురించింది.

ప్రభుత్వం చైనా దేశాధినేతకు గౌరవం ఇవ్వాలని భావిస్తూ ఈ నిర్ణయం తీసుకుందని పేర్కొంది. ఆపై రెహమాన్ తీవ్రంగా స్పందిస్తూ, ఈ విమానాశ్రయానికి బేనజీర్ భుట్టో పేరును మాత్రమే పెట్టాలని, లేకుంటే ప్రభుత్వానికి తీవ్ర ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. ప్రజల మనోగతానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటే సహించేది లేదని మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆపై సోషల్ మీడియాలో ఆయనపై జోకులు పరుగులు పెట్టగా, విషయం తెలుసుకున్న రెహమాన్ ఫూల్ గా మిగిలారు.

More Telugu News