: మంత్రివర్గ కూర్పులో ఆసక్తికర పరిణామాలు... కొందరు అలక.. మరికొందరు అభ్యర్థన!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నేడు (ఆదివారం)  మంత్రివర్గాన్ని విస్తరించనున్న నేపథ్యంలో శనివారం పార్టీలో పలు ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. తీసివేతల జాబితాలో తమ పేర్లున్నాయన్న విషయం తెలిసిన పాతమంత్రులు తమను తీసివేయొద్దు అంటూ ముఖ్యమంత్రి వద్ద విన్నవించుకుంటే, తమను తీసుకోవాలంటూ ఆశావహులు అభ్యర్థించారు. తన ఉద్వాసన గురించి తెలిసిన బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తీవ్ర మనస్తాపం చెందారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వవద్దంటూ రామసుబ్బారెడ్డి పట్టుబట్టారు.

అలాగే, ఈసారి తమకు అవకాశం కల్పించాలని ధూళిపాళ్ల నరేంద్ర, బొండా ఉమ విజ్ఞప్తి చేశారు. దీంతో పార్టీలో శనివారం అలకలు, విజ్ఞప్తులు కనిపించాయి. అయితే చంద్రబాబు అందరినీ పిలిపించి నచ్చజెప్పారు. ఎవరిని ఎందుకు తొలగిస్తున్నది, కొత్త వారిని ఎందుకు మంత్రివర్గంలోకి తీసుకుంటున్నది వివరించారు. తనను అర్థం చేసుకోవాలని, మంత్రి పదవులు ఇవ్వలేని వారికి మరో విధంగా న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. మరోవైపు అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ముఖ్యమంత్రిని కలిసి మాట్లాడారు. జిల్లా నుంచి ఏదైనా మార్పు చేయదలిస్తే ప్రస్తుతం ఉన్న ఇద్దరు మంత్రుల స్థానంలో కొత్తవారికి అవకాశం ఇవ్వాలని కోరారు. కాల్వ శ్రీనివాసులు, పయ్యావుల కేశవ్‌లకు  పదవులు ఇస్తే పార్టీకి మంచిదని సూచించారు.

More Telugu News