: రాజ్య‌స‌భ‌లో గోవా సీఎం.. పారికర్ ను చూడగానే వ్యతిరేక నినాదాలతో హోరెత్తించిన కాంగ్రెస్ సభ్యులు!

ఇటీవ‌లే ర‌క్ష‌ణ శాఖ మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేసిన మ‌నోహ‌ర్ పారిక‌ర్ గోవా ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన విష‌యం తెలిసిందే. అయితే, ఆయ‌న ఈ రోజు రాజ్య‌స‌భ‌కు వ‌చ్చారు. ఆయ‌న‌ను చూసిన వెంట‌నే కాంగ్రెస్ స‌భ్యులు ఆయనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. స్పీక‌ర్ పోడియం వ‌ద్ద‌కు దూసుకెళ్లి ఆందోళ‌న తెలపడంతో గంద‌ర‌గోళం నెల‌కొంది. కాంగ్రెస్‌ సభ్యులు దిగ్విజయ్ సింగ్, బీఏ హరిప్రసాద్‌తో పాటు ప‌లువురు మాట్లాడుతూ.. గోవాలో బీజేపీ అక్ర‌మంగా ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసింద‌ని అన్నారు. మ‌రోవైపు పారిక‌ర్‌కు మద్దతుగా బీజేపీ సభ్యులు కూడా నిలబడి నినాదాలు చేశారు. తీవ్ర‌ గంద‌ర‌గోళం నెలకొన్న నేప‌థ్యంలో కేంద్ర మంత్రి ముఖ్తాస్ అబ్బాస్ నఖ్వి మాట్లాడుతూ.. గోవా కాంగ్రెస్‌ ఇంచార్జిగా ఉన్న దిగ్విజయ్ సింగ్ కు పారిక‌ర్‌ ప్రత్యేక ధన్యవాదాలు చెప్పేందుకు వచ్చారని చుర‌క‌లు అంటించారు. దీంతో కాంగ్రెస్ స‌భ్యుల‌కు ఆగ్ర‌హం రాగా, బీజేపీ స‌భ్యులు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. కాగా, ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న పారికర్, త్వరలోనే తన సభ్యత్వానికి రాజీనామా చేస్తారు.  

More Telugu News