: 'రెడ్ డాన్' సంగీత కోసం పబ్బుల్లో మహిళా కానిస్టేబుళ్లతో కలిసి చిందులేసిన పోలీసులు... ఎలా పట్టుబడిందంటే!

ఎర్ర చందనం కేసులో లేడీ డాన్ గా ఏపీ పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన సంగీత, తన భర్త మాటలను పెడచెవిన పెట్టడంతోనే పోలీసులకు దొరికిందని తెలుస్తోంది. అప్పటికీ పోలీసులు ఆమె ఎక్కడుందన్న గుట్టును రట్టు చేసేందుకు పడరాని పాట్లు పడాల్సి వచ్చింది. ఇప్పటికే మూడు సార్లు కోల్ కతా వెళ్లి, విఫలమై వచ్చిన చిత్తూరు పోలీసులు, ఈ దఫా మాత్రం అత్యంత నాటకీయంగా ఆమెను అరెస్ట్ చేయగలిగారు. దాదాపు ఏడాదిన్నరగా సంగీత కోసం వెతుకుతున్న పోలీసులు, ఆమె పేయింగ్ గెస్టుగా నెలకొక హాస్టల్ లో ఉంటోందని పక్కా సమాచారం అందడంతో గత నెల 23న డీఎస్పీ గిరిధర్, సీఐ ఆదినారాయణ, ఎస్ఐ వాసంతి, మరో మహిళా కానిస్టేబుల్ ఆమెను అరెస్ట్ చేసేందుకు వెళ్లారు. రెండు రోజులు గడిచినా, ఆమె కస్బా, రూబ్, సీఎస్ రాయ్ ప్రాంతాల్లో ఉన్నట్టు ఉప్పందినా, ఎక్కడుందన్న విషయం మాత్రం తెలియలేదు.

ఇక వెనుదిరగడం మినహా మరో మార్గం కనిపించలేదనుకుంటున్న సమయంలో ఆమె రూబ్ సెల్లార్ లోని పబ్ లో ఉందని వారికి తెలిసింది. ఇక అక్కడికి వెళ్లిన పోలీసులు, మహిళా కానిస్టేబుల్స్ తో లోపలికి వెళ్లి, ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు కస్టమర్లుగా నటించాల్సి వచ్చింది. అక్కడే సంగీత ఉందని తెలుసుకుని, కాసేపు డ్యాన్స్ చేస్తూ, ఆమె సంగీతేనని నిర్ధారించుకున్నారు. ఆపై ఆమెను వెంబడించి, సీఎన్ రాయ్ రోడ్డులోని పీజీ హాస్టల్ లో ఉంటోందని గుర్తించారు. సమీపంలోనే ఓ గది తీసుకుని, ఆమెపై నిఘా పెట్టారు.

ఇక 28వ తేదీ మంగళవారం నాడు సంగీత మందులు తీసుకునేందుకు బయటకు రాగా, ఒక్కసారిగా చుట్టుముట్టి, తమతో రావాలని ఆదేశించారు. తొలుత వాంతులు వస్తున్నాయని, కళ్లు తిరుగుతున్నాయని బుకాయించిన ఆమె ప్లాన్ ను పోలీసులు పారనీయలేదు. వెంటనే కస్బా పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి, తమ వద్ద ఉన్న వారెంట్లను చూపి, ఆపై కోల్ కతా విమానాశ్రయం నుంచి బెంగళూరుకు, అక్కడి నుంచి చిత్తూరుకు తీసుకువచ్చారు. ఆమెను ప్రశ్నించి మరిన్ని నిజాలు రాబట్టాల్సి వుందని పోలీసులు కస్టడీ కోరగా, కోర్టు నాలుగు రోజుల కస్టడీకి అనుమతించింది.

More Telugu News