: తీసివేతలు.. కూడికలపై కసరత్తు.. లోకేశ్‌కు పంచాయతీరాజ్ శాఖ?

ఏపీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు ముహూర్తం ఖరారైంది. ఆదివారం ఉదయం 9.25 గంటలకు కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ఉండే అవకాశం ఉందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. వెలగపూడిలో అసెంబ్లీ భవనం పక్కన ఉన్న విశాలమైన ఖాళీ స్థలంలో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ఉంటుందని, ఈ మేరకు గవర్నర్ నరసింహన్‌కు సమాచారం అందించినట్టు తెలుస్తోంది. ఇక నారా లోకేశ్‌కు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఇచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే ఈ శాఖను నిర్వహిస్తున్న మంత్రి అయ్యన్నపాత్రుడుకు మరో శాఖ ఇవ్వనున్నారు.  

 కిమిడి మృణాళినిని మంత్రివర్గం నుంచి తప్పిస్తే శ్రీకాకుళం జిల్లా నుంచి ఆమె సమీప బంధువు కిమిడి కళావెంకట్రావుకు చాన్స్ దక్కవచ్చని చెబుతున్నారు. విజయనగరం జిల్లా నుంచి బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ రంగారావు పేరు వినిపిస్తోంది. రావెల కిషోర్‌బాబును తప్పిస్తే మాదిగ సామాజిక వర్గం నుంచి మరొకరికి అవకాశం దక్కనుంది. ఈ నేపథ్యంలో ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే డేవిడ్‌ రాజు, పాయకరావుపేట ఎమ్మెల్యే వి.అనిత, కొవ్వూరు ఎమ్మెల్యే జవహర్‌ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. మహిళ అయితే అనిత, సీనియారిటీని ప్రాతిపదికగా తీసుకుంటే డేవిడ్ రాజుకు అవకాశం దక్కవచ్చు.

ఇక పీతల సుజాత స్థానంలో వేరొకరిని తీసుకోవాలనుకుంటే నక్కా ఆనందబాబు, గొల్లపల్లి సూర్యారావు, శ్రావణ్‌ కుమార్‌ పేర్లు పరిశీలనకు వచ్చే అవకాశాలున్నాయి. చిత్తూరు జిల్లా నుంచి మంత్రి బొజ్జలను తప్పిస్తే అమర్‌నాథ్ రెడ్డికి చోటు ఖాయమని అంటున్నారు. ఇక నెల్లూరు జిల్లా నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి చోటు ఖాయమని తెలుస్తోంది. అనంతపురం నుంచి చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు, ఎమ్మెల్యే బీకే పార్థసారథిలలో ఒకరికి అవకాశం రానుంది. కర్నూలు జిల్లా నుంచి భూమా అఖిలప్రియకు బెర్తు ఖరారైంది. ఇక కడప జిల్లాలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌ను ఎదుర్కొనగలిగే నేతకు మంత్రి పదవి ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నట్టు తెలుస్తోంది. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నాయి.  
 

More Telugu News