: మొగ‌ల్తూరు బాధిత కుటుంబాలు రోడ్డున పడకుండా ఆదుకోవాలి: ప‌వ‌న్ కల్యాణ్

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా, మొగ‌ల్తూరులోని ఆక్వాఫుడ్ ప్రాసెసింగ్ పార్కులో ఈ రోజు ర‌సాయ‌నాల ట్యాంకు శుభ్రం చేస్తుండ‌గా ఐదుగురు మృతి చెందిన విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌పై జ‌న‌సేన అధినేత‌, సినీన‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. ఈ రోజు ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. ప్ర‌మాణాలు పాటించ‌కుండా కొన‌సాగుతున్న ఇటువంటి వాటిపై ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అన్నారు. ఈ ఘ‌ట‌న‌లో మృతి చెందిన వారి కుటుంబాలు రోడ్డున ప‌డ‌కుండా, న్యాయం జ‌రిగేలా ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రించాలని అన్నారు. ఇటువంటి వాటిపై తాను గట్టిగా మాట్లాడితే ప‌రిశ్ర‌మ‌ల‌కు వ్య‌తిరేక‌మా? అని కొంద‌రు విమ‌ర్శిస్తార‌ని, తాను ప‌రిశ్ర‌మ‌ల‌కు వ్య‌తిరేకం కాదని, ప్ర‌మాణాలు పాటించ‌ని ఇటువంటి వాటికే వ్య‌తిరేకమ‌ని చెప్పారు.

ప‌రిశ్ర‌మ‌ల్లో ప్ర‌మాణాలు పాటిస్తున్నారా? లేదా? అన్న విష‌యం గురించి ప్ర‌భుత్వం క్షుణ్ణంగా ప‌రిశీలించాల‌ని పవన్ అన్నారు. ఇటువంటి ప‌రిశ్ర‌మ‌ల‌కు లైసెన్సులు క్యాన్సిల్ చేయాల‌ని అన్నారు. క‌నీస ప్ర‌మాణాలు పాటించకుండా ప్రాణాలు తీస్తోన్న ప‌రిశ్ర‌మ‌ల‌పై క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాల‌ని చెప్పారు. ఇటువంటి ప్ర‌మాదాలు జ‌ర‌గ‌కుండా చేయ‌డం పొల్యూష‌న్ కంట్రోల్ బోర్డు వంటి శాఖ‌ల బాధ్య‌త అని, అధికారులు జీతాలు తీసుకుంటున్న‌ప్పుడు స‌రిగ్గా ప‌నిచేయాల‌ని అన్నారు.

More Telugu News