: చాలా పెద్ద గొడవలు జరగనీయొద్దు... తెలుగుదేశం ప్రభుత్వానికి నా విజ్ఞప్తి ఇదే: పవన్ కల్యాణ్

ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే అగ్రీగోల్డ్ సంస్థకు వేల ఎకరాల భూములు ఉన్నాయని, వాటిల్లో 600 ఎకరాలకు పైగా విస్తీర్ణంలోని హాయ్ ల్యాండ్ కూడా ఉందని గుర్తు చేసిన పవన్ కల్యాణ్, ఈ ఆస్తుల వేలాన్ని పూర్తి పారదర్శకంగా పూర్తి చేసి బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఆస్తులు ప్రభుత్వ పెద్దల చేతుల్లోకి వెళితే మాత్రం చాలా పెద్ద గొడవలు జరుగుతాయని, అలా కాకుండా చూడాల్సిన బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వానిదేనని పవన్ స్పష్టం చేశారు. ఈ సమస్య వెనుక వ్యక్తిగత లబ్ది ఉంటే మాత్రం ధర్మం తప్పినవారై, చాలా తప్పు చేసినట్టు అవుతుందని హెచ్చరించారు.

ఆడపడుచుల కన్నీటిపై, కూలీ నాలీ చేసుకునే వారి ఒక్కో రూపాయిపైనా ప్రభుత్వాలు గట్టి నిర్ణయం తీసుకోవాల్సి ఉందని, ఒక్క రూపాయీ నష్టపోకుండా చూడాలని డిమాండ్ చేశారు. ఆస్తులు ప్రభుత్వానికి చెందాలని, ప్రభుత్వ పెద్దలకు చెందితే మాత్రం, వామపక్షాలతో కలిసి పోరాటం చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. వేల ఎకరాల ఆస్తులున్న అగ్రీగోల్డ్ యాజమాన్యాన్ని బలవంత పెట్టి, ఫైనాన్షియల్ ఎక్స్ పర్ట్స్ సలహాలు తీసుకుని, సహారాలో సుబ్రతోరాయ్ ని బిగించి కూర్చోబెట్టినట్టు చేయాలని, అందుకు హైకోర్టు లేదా ప్రభుత్వం కల్పించుకుని సమస్య పరిష్కారానికి ప్రయత్నించాలని సలహా ఇచ్చారు. సాధ్యమైనంత త్వరలో సమస్య పరిష్కారం దిశగా అడుగులు పడకుంటే, తాను మరోసారి ఉద్యమిస్తానని బాధితులకు పవన్ హామీ ఇచ్చారు.

More Telugu News