: శవాల మీద చిల్లర ఏరుకునే పరిస్థితి తేవద్దు: సర్కారుకు పవన్ హెచ్చరికలు

తమ తప్పు లేకుండానే తీవ్ర ఇబ్బందులు పడుతున్న అగ్రీగోల్డ్ ఏజంట్లను ఆదుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం దిగిరావాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. సర్వస్వం అమ్మేసి ఇప్పటికే ఎంతో మంది డబ్బులను వెనక్కు చెల్లించిన ఏజంట్లు రోడ్డున పడ్డారని, వారిని మరింతగా ఇబ్బందులు పెట్టవద్దని డిపాజిట్ దారులను కోరిన పవన్, వారిని ఆదుకుని తీరాల్సిందేనని స్పష్టం చేశారు. ఏజంట్లను శవాలపై చిల్లర ఏరుకునే పరిస్థితికి తీసుకురావద్దని హెచ్చరిస్తూ, సమస్య పరిష్కారానికి ప్రభుత్వమే కల్పించుకోవాలని కోరారు.

దక్షిణ భారతావనితో పాటు 9 రాష్ట్రాల్లో విస్తరించిన అగ్రీగోల్డ్ ఆస్తులపై ప్రభుత్వాలు ఇంతవరకూ టాస్క్ ఫోర్స్ ను ఎందుకు పెట్టలేదని, ఎక్కడ ఏ ఆస్తులున్నాయో లెక్కించకపోవడాన్ని చూస్తుంటే, కొందరు ప్రభుత్వ పెద్దల పాత్ర కూడా ఉందన్న అనుమానాలు వస్తున్నాయని పవన్ కల్యాణ్ ఆరోపించారు. ఇంతమంది ప్రజలు ఇబ్బందులు పడుతుంటే, ఏజంట్లపై దాడులు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా? అని ప్రశ్నించారు. ఏజంట్లపై దాడులు జరుగకుండా స్థానిక పోలీసు స్టేషన్లకు, జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు ఎందుకు జారీ చేయలేదని ప్రభుత్వాన్ని అడిగారు. ఇకపై ఒక్క చావు కూడా లేకుండా ప్రభుత్వం భరోసా ఇవ్వాలని, ఎంతో కొంత ఫండ్ రిలీజ్ చేసి చిన్న చిన్న పెట్టుబడులు పెట్టిన వారికి వెనక్కు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రూ. 20 వేల వరకూ పెట్టిన వారు 13 లక్షల మంది ఉన్నారని, వారి డబ్బు వెనక్కు ఇస్తే, ఆత్మహత్యలు ఆగుతాయని సూచించారు.

More Telugu News