: మాట్లాడమని చాలా సార్లు అడిగారు... ఎందుకు స్పందించలేదంటే...: పవన్ కల్యాణ్

అగ్రీగోల్డ్ బాధితుల సమస్యలపై ఇంతకాలం ఎందుకు మాట్లాడలేదన్న విషయంపై పవన్ కల్యాణ్ నోరు విప్పారు. ఈ ఉదయం విజయవాడ గేట్ వే హోటల్ వద్ద మీడియాతో మాట్లాడిన ఆయన, 2016 నుంచి సమస్య పెరిగిందని, దీనిపై తాను స్పందించాలని పలువురు కోరినప్పటికీ, కేసు కోర్టు పరిధిలో ఉండటం, సంస్థ యాజమాన్యాన్ని అరెస్ట్ చేయడం, ఆస్తుల వేలం ప్రక్రియ ప్రారంభం కావడంతోనే బాధితులకు సత్వర న్యాయం జరుగుతోందన్న ఉద్దేశంతో తాను స్పందించలేదని చెప్పారు.

గతంలో సహారా వంటి సంస్థలు కూడా ఇదే తరహా మోసాలు చేస్తే, సుప్రీంకోర్టు కల్పించుకుందని, ఇక్కడ మాత్రం న్యాయం జరగలేదని పవన్ ఆరోపించారు. ఏపీలో అగ్రీగోల్డ్ కు 14 వేల ఎకరాల భూమి ఉందని తనకు తెలిసిందని, దీన్ని విక్రయిస్తే, సమస్య ఎంతో సులువుగా పరిష్కారం అవుతుందని చెప్పారు. ఆస్తులకు విలువ ఉన్న వేళ, కంపెనీ ఇలా ఎందుకు నష్టపోయిందన్న విషయం, ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందన్న ప్రశ్నలు తనలో ఉన్నాయని తెలిపారు.

 బాధితులతో మాట్లాడి తన అభిప్రాయం చెబుతానని వెల్లడించారు. ఈ సమస్య ఆర్థిక వ్యవహారాలతో కూడిన చిక్కుముడి కాబట్టి జాగ్రత్తగా పరిష్కరించాల్సి వుందని అన్నారు. సమస్య తెలుసుకోకుండా ముందే ఆరోపణలు చేయాలని అనుకోవడం లేదని చెప్పారు. బాధితులు ముందు ఆత్మహత్యలు చేసుకోవడాన్ని ఆపాలని కోరారు. సంస్థ ఆస్తులు ఎక్కడున్నాయో ప్రభుత్వం స్పష్టంగా బాధితులకు చెప్పాలని డిమాండ్ చేశారు. 

More Telugu News