: ఇండియాలో మహిళలపై వివక్ష... నా తల్లిని న్యాయమూర్తి కానీయలేదు: సంచలన ఆరోపణలు చేసిన నిక్కీ హేలీ

ఐక్యరాజ్యసమితిలో అమెరికా తరఫున శాశ్వత సభ్యురాలిగా బాధ్యతలు చేపట్టిన ప్రవాస భారతీయురాలు నిక్కీ హేలీ, ఇండియాలో మహిళా వివక్షపై సంచలన ఆరోపణలు చేశారు. తన తల్లిని ఇండియాలో న్యాయమూర్తి పదవిని చేపట్టనీయలేదని ఆరోపించారు. విదేశీ సంబంధాలపై అడిగిన ఓ ప్రశ్నకు సమాధానం ఇస్తూ, "ఇండియాలో ఉన్నత విద్యకు పెద్దగా అవకాశాలు లేవు. నా తల్లి న్యాయశాస్త్రాన్ని అభ్యసించింది. ఇండియాలో తొలి మహిళా న్యాయమూర్తుల్లో ఒకరిగా ఉండాలని ఆమె భావించింది. కానీ, మహిళైన కారణంగా ఆమెను అనుమతించ లేదు. ఇప్పుడామె తన కుమార్తె సౌత్ కరోలినా గవర్నర్ గా, యూఎన్ లో యూఎస్ అంబాసిడర్ గా ఉండటాన్ని చూసి గర్విస్తున్నారు" అని నిక్కీ హేలీ తెలిపారు.

కాగా, ఇండియాలో 1937 నుంచి మహిళా న్యాయమూర్తులు ఉన్నారన్న సంగతి గమనార్హం. హేలీ తల్లిదండ్రులైన అజిత్ సింగ్, రాజ్ కౌర్ లు 1960 ప్రాంతంలో ఇండియాను వీడి అమెరికాకు వలస వెళ్లారు. ఢిల్లీ యూనివర్శిటీలో రాజ్ కౌర్ న్యాయ విద్యను అభ్యసించారు. అంతకు రెండు దశాబ్దాలకు ముందే, ట్రావెన్ కోర్ కోర్టులో అన్నా చాందీ అనే మహిళ న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారన్న సంగతి హేలీకి తెలియకపోవడం గమనార్హం.

More Telugu News