: సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. బీఎస్-3 వాహనాలపై వేటు.. ఆటోమొబైల్ పరిశ్రమ షాక్!

భారత అత్యున్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. భారత్ స్టేజ్-4 (బీఎస్-4) కర్బన ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా లేని వాహనాలపై వేటేసింది. బీఎస్-4 ప్రమాణాలకు అనుగుణంగా లేని అన్ని వాహనాలను నిషేధిస్తూ బుధవారం తీర్పు చెప్పింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచే ఈ ఆదేశాలు అమల్లోకి రానున్నాయి. ఆటోమొబైల్ తయారీదారుల కంటే ప్రజారోగ్యమే ముఖ్యమని పేర్కొన్న సుప్రీం తీర్పుతో వాహన పరిశ్రమ షాక్‌కు గురైంది.

బీఎస్-4 ప్రమాణాలు లేని వాహనాలను తయారీదారులు కానీ, డీలర్లు కానీ విక్రయించడానికి వీల్లేదని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. అంతేకాదు, మోటారు వాహనాల చట్టం-1988 కింద బీఎస్-4 ప్రమాణాలు లేని వాహనాలను అధికారులు రిజస్టర్ చేయకూడదని ఆదేశించింది. అయితే మార్చి 31లోపు విక్రయించినట్టు స్పష్టమైన రుజువులు చూపిస్తే రిజిస్ట్రేషన్ చేయవచ్చని తీర్పులో పేర్కొంది. బీఎస్-3 ప్రమాణాలు కలిగిన వాహనాల విక్రయాలు, రిజిస్ట్రేషన్లను నిషేధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై మంగళవారం వాదనలు విన్న కోర్టు బుధవారం ఆదేశాలు జారీ చేసింది.

బీఎస్-3 ప్రమాణాలు కలిగిన వాహనాలు కంపెనీల వద్ద 8.24 లక్షలు ఉన్నాయని, వాటిలో 96 వేలు వాణిజ్య వాహనాలు కాగా, 6 లక్షలకుపైగా ద్విచక్ర వాహనాలు, 40 వేల త్రిచక్ర వాహనాలు ఉన్నట్టు ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (సియామ్) ఇదివరకే సుప్రీంకోర్టుకు తెలియజేసింది. గతంలో బీఎస్-2 నుంచి బీఎస్-3కి మారినప్పుడు మిగిలి ఉన్న వాహనాల విక్రయానికి అనుమతించినట్టు సియామ్ కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. అయితే ప్రజారోగ్యం కంటే ఏదీ ముఖ్యం కాదని జస్టిస్‌ మదన్‌ బి.లోకూర్, జస్టిస్‌ దీపక్‌ గుప్తాలతో కూడిన ధర్మాసనం తేల్చి చెప్పింది. సుప్రీం తీర్పుపై పర్యావరణ వేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ తీర్పుతో మొత్తం ఆటోమొబైల్ సరఫరా వ్యవస్థకు ఇబ్బందులు ఏర్పడతాయని ఆటోమొబైల్ రంగ ప్రముఖుడు, ఈవై పార్ట్‌నర్ రాకేశ్ భాత్ర పేర్కొన్నారు.

More Telugu News