: సంస్కరణల దిశగా కీలక అడుగు.. జీఎస్టీ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

ఎనిమిది గంటల సుదీర్ఘ చర్చ తర్వాత చారిత్రాత్మక వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) బిల్లుకు బుధవారం లోక్‌సభ మూజువాణి ఓటు ద్వారా ఆమోదముద్ర వేసింది. బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలపడంపై ప్రధాని నరేంద్రమోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన ట్వీట్ చేశారు. ‘కొత్త సంవత్సరం, కొత్త చట్టం, కొత్త భారతం, జీఎస్టీ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందిన శుభ సందర్భంలో దేశ ప్రజలకు అభినందనలు’’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. జీఎస్టీ బిల్లును జూలై 1 నుంచి అమల్లోకి తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తోంది.

బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టడానికి ముందు, పెట్టిన తర్వాత కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ మాట్లాడారు. జీఎస్టీతో దేశవ్యాప్తంగా ఏకరూప ప్రత్యక్ష పన్నుల విధానం అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. నిత్యావసరాలను వినియోగించే దానిని బట్టి పన్ను ఉంటుందని, కాబట్టి వాటి ధరలు తగ్గుతాయని తెలిపారు. అంటే ధనికులు వినియోగించే నిత్యావసరాలపై ఓ రకమైన పన్ను, సామాన్యులు వినియోగించే నిత్యావసరాలపై మరో రకమైన పన్ను ఉంటుందని వివరించారు. ఈ విధానం ద్వారా వ్యాపారులపై పాలకులు వేధింపులకు పాల్పడే అవకాశం ఉండదని పేర్కొన్నారు.

ఈ పన్ను విధానం అమల్లోకి వచ్చిన సంవత్సరం తర్వాత రియల్ ఎస్టేట్ రంగాన్ని కూడా దీని పరిధిలోకి తెచ్చే యోచనలో ఉన్నట్టు తెలిపారు. స్వాతంత్ర్యానంతరం అతిపెద్ద పన్నుల సంస్కరణ ఇదేనని పేర్కొన్న జైట్లీ, ఈ బిల్లు అమలుతో దేశ జీడీపీ వృద్ధి 2 శాతం పెరుగుతుందని పేర్కొన్నారు. జీఎస్టీ విధానంలో 5, 12, 18, 28 శాతం పన్నుల రేట్లు ఉంటాయని చెప్పారు. జీఎస్టీ అమలుతో రాష్ట్రాలకు కలిగే నష్టాన్ని కేంద్రం ఐదేళ్లపాటు భరిస్తుందని జైట్లీ వివరించారు.

More Telugu News