: ఏప్రిల్ 2న కేబినెట్ పునర్వ్యవస్థీకరణ.. లోకేశ్, అఖిలప్రియకు పదవులు ఖాయం.. ఐదుగురిపై వేటు?

ఆంధ్రప్రదేశ్ కేబినెట్ పునర్వ్యస్థీకరణకు ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్ 2న కేబినెట్‌ విస్తరణకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముహూర్తం ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. అనుకోని కారణాల వల్ల ఆరోజు కాకుంటే 6న ఖాయమని చెబుతున్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి అప్పటి మంత్రివర్గాన్నే కొనసాగిస్తున్నారు. రెండేళ్లలోపు మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించడం ఆనవాయితీ అయినా వివిధ కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది.

తాజా పరిణామాలను బట్టి చూస్తే ప్రస్తుత కేబినెట్ నుంచి నలుగురైదుగురికి ఉద్వాసన పలకనున్నారు. దీంతో పదిమంది కొత్త వారికి చాన్స్ లభించే అవకాశం వుందని అంటున్నారు. నారా లోకేశ్, భూమా అఖిలప్రియలకు మంత్రి పదవులు దాదాపు ఖాయమయ్యాయి. అలాగే ముస్లిం మైనారిటీ నుంచి ఒకరిని తీసుకోనున్నట్టు సమాచారం. ఎంఏ షరీఫ్, జలీల్ ఖాన్, చాంద్ బాషాలలో ఒకరిని కేబినెట్‌లోకి తీసుకోవచ్చని సమాచారం. పార్టీ సీనియర్ నేతలైన కళా వెంకట్రావు, పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తదితరులకు చాన్స్ ఉంది.

ఓ మహిళా మంత్రి, ఆరోగ్యం దెబ్బతినడం కారణంగా కదల్లేని స్థితిలో ఉన్న ఓ సీనియర్ మంత్రికి ఉద్వాసన తప్పకపోవచ్చని సమాచారం. చురుగ్గా ఉన్నప్పటికీ తన శాఖపై పట్టు సాధించలేకపోయిన మరో మంత్రిపైనా వేటు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఆశావహుల జాబితా అయితే చాలానే ఉంది. కళావెంకట్రావు, సుజయ రంగారావు, గౌతు శివాజీ, ఎంవీవీఎస్ మూర్తి, బండారు సత్యనారాయణ, అనిత, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, జ్యోతుల నెహ్రూ, తోట త్రిమూర్తులు, బొండా ఉమామహేశ్వరరావు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, బీదా రవిచంద్ర యాదవ్, ధూళిపాళ నరేంద్ర.. ఇలా చెప్పుకుంటూ పోతే మంత్రి పదవులు ఆశిస్తున్న వారి జాబితా పెద్దదే!

More Telugu News