: అమరావతిని 'సంతోష నగరి'గా మారుస్తాం.. తెలుగు ప్రజలకు చంద్రబాబు ఉగాది శుభాకాంక్షలు

ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. నవ్యాంధ్రలో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతిని సంతోష నగరిగా మారుస్తామని తెలిపారు. మంగళవారం అసెంబ్లీ ప్రాంగణంలో సీఆర్‌డీఏ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండేళ్లలో అమరావతి నిర్మాణాన్ని పూర్తిచేస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టు ద్వారా రైతుల జీవితాల్లో వెలుగులు నింపుతామన్నారు.

సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చని పట్టిసీమ పథకం నిరూపించిందని, ఇదే స్ఫూర్తితో పోలవరం ప్రాజెక్టును పూర్తిచేస్తామని సీఎం తెలిపారు. ‘హ్యాపీ సిటీ’ లక్ష్యంతో రాజధానిని నిర్మిస్తున్నామని, అందరికీ ఉద్యోగ, ఉపాధి అవకాశాలతో ‘ఎకనామిక్ పవర్‌హౌస్’గా ఉంటుందని తెలిపారు. రాజధానిలో పదేళ్లలో తలసరి ఆదాయం రూ.6 లక్షలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. నేరరహిత నగరంగా, నాణ్యమైన జీవన ప్రమాణాలు కలిగేలా అందరికీ నివాస గృహాలు కల్పిస్తామని తెలిపారు. ప్రపంచంలోని రాజధాని నగరాలేవీ రెండేళ్లలో పూర్తికాలేదని, కానీ అమరావతిని మాత్రం రెండేళ్లలో పూర్తి చేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు.

 

More Telugu News