: డబ్బుల కోసం మహిళా జడ్జికి వేధింపులు.. నగ్న ఫొటోలు ఉన్నాయంటూ బ్లాక్‌మెయిల్

కారు కొనుక్కునేందుకు డబ్బుల కోసం ఓ లీగల్ అడ్వైజర్ అడ్డదారులు తొక్కాడు. ఏకంగా మహిళా జడ్జికే ఫోన్ చేసి స్నానం చేస్తుండగా తీసిన ఫొటోలు తన వద్ద ఉన్నాయని, డబ్బులివ్వకుంటే బయటపెడతానని బ్లాక్‌మెయిల్‌కు దిగాడు. ఇప్పుడు తీరిగ్గా కటకటాలలో ఊచలు లెక్కపెట్టుకుంటున్నాడు. హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని ‘నార్త్‌స్టార్స్ హోమ్స్’లో లీగల్ అడ్వైజర్‌గా పనిచేస్తున్న మహేశ్, 2010లో అప్పటి న్యాయవాది అయిన సదరు జడ్జి వద్ద జూనియర్ అడ్వకేట్‌గా పనిచేస్తూ ఆమె కుటుంబానికి దగ్గరయ్యాడు.

ఆ సమయంలో ఆమెతోపాటు పిల్లల ఫొటోలు తీశాడు. కొన్నాళ్ల తర్వాత బుద్ధి వక్రమార్గం పట్టడంతో జడ్జితో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో అతడిని తీవ్రంగా మందలించిన ఆమె మహేశ్‌ను విధుల నుంచి తొలగించారు. ఆమెపై కక్ష పెంచుకున్న మహేశ్ ఫేస్‌బుక్‌లో నకిలీ ఖాతా తెరిచి జడ్జి, ఆమె పిల్లల ఫొటోలు అప్‌లోడ్ చేశాడు. అంతేకాక జడ్జికి ఫోన్ చేసి ‘‘నీవు స్నానం చేస్తున్నప్పుడు తీసిన ఫొటోలు నా దగ్గరున్నాయి. కారు కొనుక్కునేందుకు డబ్బులివ్వు. లేదంటే వాటిని బయట పెడతా’’ అని బెదిరించాడు. దీంతో జడ్జి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహేశ్‌ను అదుపులోకి తీసుకున్న  సైబర్ క్రైం పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

More Telugu News