: ఓడినా మార్పురాలేదు... యూపీ ఎస్పీలో మళ్లీ ఆధిపత్యపోరు

ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైనా సమాజ్ వాదీ పార్టీలో ఆధిపత్యపోరు మారలేదు. కేవలం 54 స్థానాలకే పరిమితమైన సమాజ్ వాదీలో కుటుంబ కలహాలు కొలిక్కిరాలేదు. అసెంబ్లీలో ప్రతిపక్షనేత ఎంపికపై కూడా ఈ ఆధిపత్యపోరు మొదలైంది. నేడు అఖిలేష్ యాదవ్ విజయం సాధించిన ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించగా, మరోపక్క రేపు తాను సమావేశం నిర్వహిస్తున్నానని, దానికి హాజరుకావాలని చెబుతూ గెలిచిన ఎమ్మెల్యేలకు ములాయం సింగ్ యాదవ్ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి.

దీంతో ఏం చేయాలో తెలియక గెలిచిన ఎమ్మెల్యేలు తలలుపట్టుకున్నారు. ప్రతిపక్ష నేతగా మాజీ మంత్రి రామగోవింద్ చౌదరిని ఎంపిక చేయాలని అఖిలేష్ యాదవ్ నిర్ణయించిన వేళ... తన తమ్ముడు శివపాల్ యాదవ్ ను ప్రతిపక్ష నేతగా ఎంపిక చేసేందుకు ములాయం పావులు కదుపుతున్నట్టు సమాచారం. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేత ఆజంఖాన్ కూడా ప్రతిపక్ష నేత పదవి తనకు వస్తే బాగుంటుందని ఆశపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆధిపత్యం ప్రదర్శించేందుకు అఖిలేష్, ములాయం మళ్లీ ప్రయత్నించడంతో ఓటమిపాలైనా ఫలితం ఉండడం లేదని వారు పేర్కొంటున్నారు. 

More Telugu News