: అన్ని ఆధారాలూ ఉన్నాయి.. సీబీఐ విచారణ వేయండి: టెన్త్ ప్రశ్నపత్రం లీకుపై వైఎస్‌ జగన్‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌ల‌క‌లం రేపుతోన్న పదవ‌ తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి రాష్ట్ర ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించారు. ఈ అంశంలో సీబీఐతో విచారణ జరిపించాల‌ని, అప్పుడే నిజాలు బ‌య‌ట‌కు వ‌స్తాయ‌ని అన్నారు. ఈ రోజు ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ... ప‌ద‌వ త‌ర‌గ‌తి ప్రశ్నపత్రాల లీకేజీ విష‌యంలో తప్పు జరిగిందని విద్యాశాఖే ఒప్పుకుంటోంద‌ని అన్నారు. రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ విష‌యంపై స్పందిస్తూ అటెండర్ ఫోన్ ద్వారా ప్ర‌శ్న పత్రం లీక్ అయిందని అంటున్నార‌ని, అయితే, ఆ అటెండర్ ఏ కాలేజీకి చెందిన వాడో అందరికీ తెలుసని జ‌గ‌న్ అన్నారు.

ఆ కాలేజీ ఎవరిదో ఎఫ్‌ఐఆర్‌ కాపీ కూడా చెబుతుంద‌ని, అన్ని ఆధారాలు ఉన్నప్ప‌టికీ దీనిపై సీబీఐ విచార‌ణ‌ ఎందుకు జ‌రిపించ‌బోర‌ని ఆయ‌న ప్రశ్నించారు. ఈ కేసును చిన్న అధికారులపైకి, అటెండర్లపైకి గెంటేసే ప్రయత్నం చేస్తున్నార‌ని జ‌గ‌న్ ఆరోపించారు. మంత్రి నారాయణ కారణంగా విద్యా వ్యవస్థ కుప్పకూలిపోయిందని ఆయ‌న అన్నారు.

More Telugu News