: బెంగళూరులోని ఐటీ మహిళా ఉద్యోగులకు శుభవార్త.. ఇకపై నైట్ డ్యూటీలకు సెలవు?

బెంగళూరులోని ఐటీ, బయో టెక్నాలజీ కంపెనీల్లో పని చేసే మహిళలకు శుభవార్త. ఇకపై వారికి నైట్ డ్యూటీలు వేయవద్దంటూ కర్ణాటక హౌస్ ప్యానెల్ ప్రతిపాదించింది. ఈ సందర్భంగా మహిళా, శిశు సంక్షేమ శాసనసభ కమిటీకి నేతృత్వం వహించిన ఎన్ఏ హారిస్ మాట్లాడుతూ, ఐటీ, బయో టెక్నాలజీ కంపెనీల్లో రాత్రివేళల్లో పని చేసేందుకు పురుషులకు ఉన్న అనుకూలత మహిళలకు లేదని, అందువల్ల, ఉదయం లేదా మధ్యాహ్న సమయాల్లో వారికి డ్యూటీలు కేటాయించాలని అన్నారు.

గత ఏడాది సెప్టెంబరు 9న ఇన్ఫోసిస్, బయోకాన్ వంటి కంపెనీలను తమ కమిటీ సందర్శించిందని, ఈ విషయమై ఆయా కంపెనీల యాజమాన్యంతో మాట్లాడిందని పేర్కొన్నారు. ఈ క్రమంలో సదరు సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగుల అభిప్రాయాలను, ప్రతిపాదనలను సేకరించినట్లు తెలిపారు. కాగా, మహిళా ఉద్యోగుల భద్రత విషయమై వేర్వేరు ఏజెన్సీల ద్వారా రాబట్టిన సమాచారం ప్రకారం, భద్రతా లోపాలు ఉన్నట్లు తెలిసిందన్నారు. మహిళల భద్రతకు సంబంధించి కఠినమైన చట్టాలు అమల్లో లేకపోవడం వల్లే నిందితులకు శిక్షలు తక్కువగా పడుతున్నాయని హారిస్ అభిప్రాయపడ్డారు.

 ఈ సందర్భంగా మహిళా ఉద్యోగుల కోసం కొన్ని ప్రతిపాదనలు చేసింది. కంపెనీల్లో పని చేసే మహిళా ఉద్యోగులకు ప్రత్యేక బస్సు సదుపాయం, టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ ను ఏర్పాటు చేయడంతో పాటు మహిళలు, చిన్నారులు, సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేకంగా అంబులెన్స్ ఏర్పాటు, బెంగళూరులో పింక్ పోలీస్ తో పాటు ఇందుకు సంబంధించిన యాప్ ను తీసుకురావాలని సిఫార్సులు చేసింది. ఇదిలా ఉండగా, పురుషులతో సమానంగా మహిళలకు అన్ని విధాలుగా అవకాశాలు కల్పించాలని కోరుతూ మహిళలపై ఉన్న నిబంధనలను కర్ణాటక ప్రభుత్వం గతంలో ఎత్తివేసింది. దీంతో, ఐటీ సెక్టార్ లో మహిళలు నైట్ డ్యూటీలు చేస్తున్నారు. 

More Telugu News