: ఎల్ఈడీ బల్బుల కొనుగోలులో రూ.20 వేల కోట్ల కుంభకోణం.. మోదీ సర్కారుపై కాంగ్రెస్ తొలి ఆరోపణలు

మోదీ సర్కారుపై కాంగ్రెస్ పార్టీ తొలిసారి భారీ కుంభకోణం ఆరోపణలు చేసింది. ప్రభుత్వ అవసరాలకు ఎల్ఈడీ బల్బుల కొనుగోలు పథకంలో రూ.20 వేల కోట్ల స్కాం జరిగిందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి శక్తిసింగ్ గోహిల్ సోమవారం ఆరోపించారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. బల్బుల కొనుగోలు వ్యవహారం విద్యుత్ శాఖామంత్రి పీయూష్ గోయల్ చేతుల మీదుగానే నడిచిందని, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారో చెప్పాలని నిలదీశారు.

చైనా, తైవాన్‌ల నుంచి ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తున్న నాసిరకం బల్బుల కారణంగా కరెంటు బిల్లుల భారం పెరుగుతోందని గోహిల్ అన్నారు. ఇప్పటికే 21 కోట్ల ‘ఉజాలా’ ఎల్ఈడీ బల్బులు పంచి పెట్టామన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలను గుర్తు చేసిన ఆయన ‘మేకిన్ ఇండియా’ బల్బులు కాకుండా ‘మేకిన్ చైనా’ బల్బులు ఎందుకు పంచి పెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు.

More Telugu News