: ఆసీస్ ఆలౌట్... ఎదురులేని టీమిండియా బౌలర్లు!

బోర్డర్ అండ్ గవాస్కర్ పేటీఎం ట్రోఫీలో భాగంగా హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాల వేదికగా జరుగుతున్న చివరిదైన నాలుగో టెస్టు మ్యాచ్ లో టీమిండియా ఆటగాళ్లు ఆకట్టుకున్నారు. తొలుత బ్యాటింగ్ లో సత్తా చాటి, 32 పరుగుల ఆధిక్యం సంపాదించి, తరువాత బౌలింగ్ లో సాధికారత ప్రదర్శించారు. ఆసీస్ టాపార్డర్ ను వేగంగా పెవిలియన్ కు పంపి షాకిచ్చారు. పేస్, బౌన్స్ కు అనుకూలించే పిచ్ పై టీమిండియాను ఇబ్బంది పెట్టేందుకు ఐదుగురు బౌలర్ల వ్యూహంతో ఆసీస్ బరిలోకి దిగింది.

టీమిండియా కూడా అలాంటి వ్యూహంతోనే కొత్త కుర్రాడు కుల్ దీప్ యాదవ్ ను రంగంలోకి దించింది. దీంతో రెండు జట్లు బౌలింగ్ అస్త్రశస్త్రాలతో మైదానంలోకి దిగాయి. ఈ క్రమంలో తొలి రోజు టీమిండియా బౌలర్లు ఆసీస్ పై పైచేయి సాధించి, మొదటి రోజే 301 పరుగుల వద్ద వారి ఆటకట్టించారు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన టీమిండియా ఆసీస్ పేస్ ను తట్టుకుంది. లియాన్ రాణించినప్పటికీ భారత బ్యాట్స్ మన్ వారికి సులువుగా తలవంచలేదు. దీంతో మూడోరోజు టీమిండియాకు తొలి ఇన్నింగ్స్ లో 32 పరుగుల ఆధిక్యం లభించింది.

అనంతరం రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ ప్రారంభించిన ఆసీస్ బ్యాట్స్ మన్ ను టీమిండియా బౌలర్లు కట్టడి చేశారు. టాప్ ఆర్డర్ ను పెవిలియన్ కు పంపి షాకిచ్చి తమ ఆధిపత్యం నిరూపించుకున్నారు. ఓపెనర్లు రెన్ షా (8), వార్నర్ (8) సింగిల్ డిజిట్ కే పెవిలియన్ కు చేరగా, స్మిత్ (17), హ్యాండ్స్ కోంబ్ (18) కాసేపు ప్రతిఘటించారు. మ్యాక్స్ వెల్ (45) దూకుడు ప్రదర్శించాడు. షాన్ మార్ష్ (1) వస్తూనే పెవిలియన్ చేరాడు. అనంతరం కుమ్మిన్స్ (12), ఒకీఫ్ (0), లియాన్ (0) ను బౌలర్లు పెవిలియన్ కు పంపగా, హాజిల్ వుడ్ (0) అండగా మాథ్యూ వేడ్ (25) రెచ్చిపోయాడు. చివర్లో ధాటిగా ఆడే ప్రయత్నం చేశాడు. దీంతో  53.5 ఓవర్లకు ఆసీస్ 137 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. టీమిండియా బౌలర్లలో ఉమేష్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా చెరో మూడేసి వికెట్లు తీసి ఆకట్టుకోగా, భువనేశ్వర్ కుమార్ ఒక వికెట్ తీసి వారికి సహకరించాడు. దీంతో ఆసీస్, భారత్ కు 106 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇక మరో రెండు రోజుల ఆట మిగిలి ఉంది. 

More Telugu News