: క్రికెట్ కు గుడ్ బై చెప్పిన ఆసీస్ ఫాస్ట్ బౌలర్!

ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ షాన్ టెయిట్(34) తన క్రికెట్ కెరీర్‌కు టాటా చెప్పేశాడు. తన వయసు పైబడటంతోనే తాను ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. తాను ఇంకా కొన్నేళ్లు క్రికెట్ ఆడాలనుకున్నాన‌ని, అయితే, ప్రస్తుతం క్రికెట్ లో పోటీ తత్వం బాగా పెరిగిందని చెప్పాడు. యువ క్రికెటర్లు ఎంతో మంది వచ్చారని, వారితో పోటీ పడటం కాస్త కష్టంగానే ఉందని, కాంపిటేటివ్ స్థాయి క్రికెట్ నుంచి పూర్తిగా తప్పుకుంటున్నాన‌ని తెలిపాడు. అంత‌ర్జాతీయ క్రికెట్‌లో ఫాస్టెస్ట్ బౌలర్లలో ఒకడిగా గుర్తింపు పొందిన షాన్ టెయిట్‌.. 2016-17 సీజన్ లో భాగంగా  బిగ్ బాష్ లీగ్ లో హోబార్ట్ హరికేన్స్ తరపున ఆడి ఆఖ‌రిసారి సిడ్నీ థండర్ తో జరిగిన మ్యాచ్ లో కనిపించాడు.

గ‌తంలో టీమిండియాతో సిడ్నీలో ఆడిన ట్వంటీ 20 మ్యాచే అతనికి ఆస్ట్రేలియా తరపున చివ‌రి మ్యాచ్. తన టెస్టు కెరీర్ లో షాన్ టెయిట్ కేవ‌లం మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. వ‌న్డేల్లో మాత్రం రాణిస్తూ 35 మ్యాచ్ లు ఆడి 62 వికెట్లు తీశాడు. 2007 ఆస్ట్రేలియా ప్ర‌పంచ క‌ప్ సాధించ‌డంలో టెయిట్ కీలక పాత్ర పోషించాడు. 2010లో ఇంగ్లండ్ తో జరిగిన వ‌న్డేలో 161.1 కి.మీ వేగంతో ఫాస్టెస్ బంతిని వేసి, క్రికెట్‌ అభిమానుల దృష్టిని ఆక‌ర్షించాడు.

More Telugu News