: 150 గంటలు, ఒక్క క్యాబినెట్ సమావేశం లేకుండా 50 నిర్ణయాలు... దటీజ్ యోగి స్టయిల్!

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన యోగి ఆదిత్యనాథ్, ఇంతవరకూ ఒక్క క్యాబినెట్ సమావేశాన్ని కూడా నిర్వహించకుండా, 50కి పైగా నిర్ణయాలను తీసుకుని పాలనలో దూసుకుపోతున్నారు. బాధ్యతలు చేపట్టిన తరువాత 150 గంటల వ్యవధిలో ఆయన ఎన్నో నిర్ణయాలు ప్రకటించారు. చట్ట వ్యతిరేకంగా నడుస్తున్న కబేళాల నిషేధం నుంచి యాంటీ-రోమియో స్క్వాడ్ ల ఏర్పాటు వరకూ, కూరగాయల మార్కెట్లలో పరిశుభ్రత నుంచి ప్రభుత్వ ఆఫీసుల్లో బయో మెట్రిక్ నమోదు వరకూ... ఆఫీసుల్లో పాన్ మసాలాల వాడకం రద్దు నుంచి ప్లాస్టిక్ బ్యాగుల నిషేధం వరకూ... యోగి తీసుకున్న పలు నిర్ణయాలు పాలనలో ఆయన శైలిని నిరూపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానించారు.

ఉదయం 10 గంటల్లోగా ఆఫీసుకు వచ్చి అటెండెన్స్ వేయించుకోకుంటే ఆ రోజుకు సెలవుగానే పరిగణిస్తామని ప్రభుత్వ ఉద్యోగులకు ఆయన చేసిన హెచ్చరికలపై ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. జూన్ 15 నాటికి అన్ని రాష్ట్ర రహదారులపై గుంతలు లేకుండా చూడాలని, ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి ప్రత్యేక విభాగం ఏర్పాటు, అన్ని ప్రభుత్వ విభాగాల పనితీరుపై నెలవారీ నివేదికలు, ప్రభుత్వ ఫైల్స్ ఇంటికి తీసుకు వెళ్లకుండా నిషేధం, రాజకీయ నాయకుల సెక్యూరిటీపై సమీక్ష, అధికారులు, మంత్రులు వారి ఆస్తుల వివరాలను వెల్లడించాలన్న ఆదేశాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో సీసీటీవీ కెమెరాలు, పాఠశాలలకు టీ షర్టులు వేసుకుని వెళ్లకుండా ఉపాధ్యాయులపై ఆంక్షలు, స్కూళ్లలో మొబైల్ ఫోన్ల వాడకంపై ఆంక్షలు, మానస సరోవరం యాత్రికులకు రూ. లక్ష సాయం వంటి పదుల కొద్దీ నిర్ణయాల్లో కొన్నింటిపై విమర్శలు వస్తున్నా, ఆయన మాత్రం వాటిని పట్టించుకోకుండా ముందడుగే వేస్తున్నారు.

More Telugu News