: లెగ్గింగ్స్ వేసుకొచ్చారని విమానం ఎక్కనివ్వని వైనం!

లెగ్గింగ్స్ వేసుకుని వచ్చారన్న కారణంతో ఇద్దరు అమ్మాయిలను అమెరికాకు చెందిన యునైటెడ్ ఎయిర్‌ లైన్స్ సంస్థ విమానం ఎక్కనివ్వలేదు. డెన్వర్ నుంచి మిన్నీపొలిస్ వెళ్లే విమానంలో ఈ ఘటన జరుగగా, యునైటెడ్ ఎయిర్ లైన్స్ వైఖరిపై సోషల్ మీడియాలో నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. ఇద్దరు అమ్మాయిలను విమానం ఎక్కనివ్వని అధికారులు, విమానంలో వెళ్లాలంటే, దుస్తులు మార్చుకోవాల్సిందిగా ఆదేశించారని షానన్ వాట్స్ అనే ప్రత్యక్ష సాక్షి తెలిపారు. తమ చర్యను ఆ విమానయాన సంస్థ మాత్రం సమర్ధించుకుంది.

 దుస్తులు సరిగ్గా లేకుంటే, వాళ్లను విమానం ఎక్కనివ్వకుండా అడ్డుకునే హక్కు తమకుందని చెప్పింది. సాధారణ ప్రయాణికులనైతే లెగ్గింగ్స్ లేదా యోగా ప్యాంట్లు ధరించినా తాము అనుమతిస్తామని చెబుతూ, పాస్ మీద ప్రయాణించేవాళ్లు మాత్రం తప్పనిసరిగా నిబంధనలు పాటించాల్సిందేనని తెలిపింది. ఆ ఇద్దరూ సంస్థ ఉద్యోగుల పాస్ లతో ప్రయాణిస్తున్నందునే డ్రస్ కోడ్ పాటించాల్సిందిగా సూచించామని ప్రకటించింది. లెగ్గింగ్స్ సరైన దుస్తులు కావని ఎలా చెబుతారని పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రయాణం వేళ సుఖంగా ఉండేందుకు చాలామంది మహిళలు లెగ్గింగ్స్, యోగా దుస్తులు, అథ్లెటిక్ దుస్తులు ధరిస్తారని, ఇది కొత్తేమీ కాదని చెబుతున్నారు.

More Telugu News