: బాబోయ్.. ఇదేం పరీక్ష?.. టెన్త్ ఫిజిక్స్ లో ఇంటర్ ప్రశ్నలు.. నిశ్చేష్టులైన విద్యార్థులు!

తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పదవ తరగతి పరీక్షల్లో భాగంగా శ‌నివారం ఫిజిక్స్ పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్థులకు పట్టపగలే చుక్కలు కనిపించాయి. ఉత్సాహంగా పరీక్ష కేంద్రాలకు చేరుకున్న విద్యార్థులు, ఇన్విజిలేటర్ ఇచ్చిన ప్రశ్నపత్రం చూసి నిశ్చేష్టులయ్యారు. ఆ ప్రశ్నలేంటో? తామేం సమాధానాలు రాయాలో వారికి అర్థం కాలేదు. కారణం అందులో ఫైనల్ ఇంటర్, సీబీఎస్ఈ, ఐఐటీస్థాయి ప్రశ్నలు సైతం రెండు ఉన్నాయి. పోనీ అవి వదిలేసి మిగతా ప్రశ్నలు రాయాలన్నా వారికి వీలుకానంత కఠినంగా ఉన్నాయి. ఒక్క ప్రశ్నను కూడా నేరుగా అడగలేదు. అన్నీ అప్లికేషన్ ఆధారిత ప్రశ్నలే. దీంతో ప్రశ్నపత్రం చేతపట్టుకున్న విద్యార్థులకు మైండ్ బ్లాంక్ అయింది.

ఫిజిక్స్ ప్రశ్నపత్రం చూసి ఉపాధ్యాయులు, నిపుణులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పేపర్ ను యావరేజ్, బిలో యావరేజ్ విద్యార్థులు అసలు ముట్టుకోను కూడా ముట్టుకోలేరని చెబుతున్నారు. ఈ దెబ్బకు చాలామంది విద్యార్థులు ఫెయిలవడం ఖాయమని చెబుతున్నారు. ఈ పేపర్ మొత్తం ఫలితాలపై ప్రభావం చూపిస్తుందని, ఫలితాలు దారుణంగా పడిపోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే కనీసం 10 గ్రేస్ మార్కులైనా ఇవ్వాలని ఉపాధ్యాయులు, విద్యానిపుణులు డిమాండ్ చేస్తున్నారు. 40 మార్కులకు ఇచ్చిన ఈ ప్రశ్న పత్రానికి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, గ్రామీణ విద్యార్థులు గరిష్ఠంగా 20, కార్పొరేట్ స్కూళ్ల విద్యార్థులకు 25 మార్కులకు మించి వచ్చే పరిస్థితి లేదని స్వయంగా ఉపాధ్యాయులే చెబుతున్నారు.

ప్రశ్నపత్ర రూపకల్పనలో తప్పకుండా బ్లూ ప్రింట్ పాటించాల్సి ఉంటుంది. దీని ప్రకారం 40 శాతం (16 మార్కులు) ప్రశ్నలు అందరూ రాయగలిగేలా ఉండాలి. మిగతా 30 శాతం (12 మార్కులు) సాధారణ స్థాయి విద్యార్థులు, మిగతా 30 శాతం (12 మార్కులు) ప్రశ్నలకు ప్రతిభావంతులైన విద్యార్థులు మాత్రమే జవాబులు రాసేలా రూపొందించాలి. దీనిని పరీక్షల విభాగం పట్టించుకోకపోవడం వల్లే ఫిజిక్స్ పేపర్ ఇలా వచ్చిందని విమర్శిస్తున్నారు.

More Telugu News