: నమ్మి పార్టీ పగ్గాలను అప్పగిస్తే 'టోపీ' పెడతావా?: ఎన్నికల గుర్తు ఎంపికపై దినకరన్ కు శశికళ చీవాట్లు

రెండాకుల గుర్తు చేజారి పోవడంతో పరువు పోయినట్టుగా భావిస్తున్న అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ, చివరకు టోపీ గుర్తుగా రావడాన్ని జీర్ణించుకోలేకున్నారు. తాను నమ్మకంతో పార్టీ పగ్గాలను అప్పగిస్తే, దినకరన్ చేసిన నిర్వాకంతోనే గుర్తు చేజారిందని చీవాట్లు పెట్టినట్టు తెలిసింది. ప్రస్తుతం అక్రమాస్తుల కేసులో జైల్లో ఉన్న ఆమె, పార్టీని జాగ్రత్తగా చూసుకునే వ్యక్తిగా భావించి తన సోదరి కుమారుడు టీటీవీ దినకరన్ ను ఎంచుకున్న సంగతి తెలిసిందే. తనతో సమానమైన హోదాను ఆయనకు ఇస్తే, పార్టీ పేరును, గుర్తును దూరం చేశాడని శశికళ మండిపడుతున్నారు.

 కాగా, రెండాకుల గుర్తుపై పన్నీర్ సెల్వం, శశికళ వర్గాలు పోటీ పడటంతో, ఆ గుర్తును ఎవరికీ కేటాయించని ఎన్నికల కమిషన్, అన్నాడీఎంకే తరఫున ఎవరూ పోటీ చేయరాదని ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. దీంతో శశికళ వర్గం 'అన్నాడీఎంకే అమ్మ' పేరిట టోపీ గుర్తుపై ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. పన్నీర్ వర్గం 'అమ్మ అన్నాడీఎంకే' పేరిట రంగంలోకి దిగగా, కరెంటు స్తంభం గుర్తు లభించింది.

More Telugu News