: గడువు ముగిసే లోపే బ్లాక్ మనీ వివరాలు వెల్లడించాలి.. లేదంటే బినామీ చట్టాల కింద కఠిన చర్యలు: కేంద్రం వార్నింగ్

నల్లధనంపై ఉక్కుపాదం మోపిన కేంద్ర స‌ర్కారు ఆ దిశ‌గా మ‌రిన్ని చ‌ర్య‌లు తీసుకోనున్న‌ట్లు పేర్కొంది. ఇప్ప‌టికే పెద్ద‌నోట్ల ర‌ద్దుతో న‌ల్ల‌కుబేరుల గుండెల్లో ద‌డ పుట్టించిన ప్ర‌ధాని మోదీ ప్ర‌భుత్వం ఇక బినామీ చ‌ట్టం మీద ప్ర‌త్యేక శ్ర‌ద్ధ‌పెట్టింది. ఈ రోజు న‌ల్ల‌కుబేరుల‌కు ప‌లు హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. బ్లాక్ మ‌నీని ప్ర‌క‌టించుకోవ‌డానికి తాము అందుబాటులోకి తీసుకొచ్చిన ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన(పీఎంజీకేవై) గడువు ఈ నెల 31కి ముగుస్తుందని, న‌ల్ల‌కుబేరుల‌కు ఇదే చి‌వ‌రి అవకాశమని హెచ్చరించింది. న‌ల్ల‌కుబేరులు త‌మ హెచ్చ‌రిక‌లు పెడ‌చెవిన పెడితే బినామీ చట్టాల కింద కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని స్ప‌ష్టం చేసింది. డిఫాల్టర్ల పేర్లను ఈడీ, సీబీఐ లాంటి కేంద్ర విచారణ సంస్థలకు షేర్ చేస్తామని తెలిపింది.

ఇక పన్ను, జరిమానాలు భారీగా ఉంటాయని పేర్కొంది. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజనను సద్వినియోగం చేసుకోక‌పోతే బ్లాక్‌మ‌నీ డిపాజిట్లకు 137 శాతం కంటే ఎక్కువ పన్ను, జరిమానాలు ఉంటాయ‌ని చెప్పింది. వారిపై బినామి చట్టాలను ప్రయోగించడంలో వెనకడుగు వేయ‌బోమ‌ని తేల్చిచెప్పింది. ఈ ప‌థ‌కం ద్వారా ఆస్తులు ప్ర‌క‌టించే వారి వివరాలను బయటపెట్టబోమని, కానీ వారి ఆదాయంపైన 49.9 శాతం పన్ను ఉంటుందని తెలిపింది. మ‌రోవైపు ఈ ప‌థ‌కాన్ని ఉప‌యోగించుకోకుండా ఆదాయపు పన్ను రిటర్న్స్ లో బ్లాక్ మ‌నీ వివరాలు తెలిపితే వారికి 77.25 శాతం ప‌న్ను జ‌రిమానా వేస్తామ‌ని చెప్పింది. ఆదాయ‌ప‌న్ను శాఖ సోదాలు జ‌రుపుతున్న స‌మ‌యంలో త‌నిఖీల్లో బయటపడిన నల్లధనాన్ని స్వాధీనం చేయని వారికి ఏకంగా 137.25 శాతం పన్ను విధిస్తామ‌ని తెలిపింది.

More Telugu News