: 'అబ్బాయి, అమ్మాయి ఎప్పటికీ స్నేహితులు కాదు'... యూపీలో మోరల్ పోలీసింగ్ సాగుతున్న వైనమిది!

ఉత్తరప్రదేశ్ లో అమ్మాయిలను ఏడిపించే ఆకతాయిలను నిలువరించేందుకు సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలతో ఏర్పాటైన యాంటీ రోమియో స్క్వాడ్, ఒక రోజులో ఎలా విధులు నిర్వహించారో తెలియజేసే కథనమిది. ఓ జాతీయ మీడియా ప్రతినిధులు యాంటీ రోమియో పోలీస్ జీపులో రోజంతా ప్రయాణించారు. పోలీసులతో కలిసి తిరుగుతూ, వారు విధులు నిర్వహించే తీరును గమనించారు. యువతులను, అమ్మాయిలను ఏడిపించే రోమియోల ఆట కట్టించడమే వీరి లక్ష్యం. "ఎవరి ముఖంపైనా రోమియో అని రాసి వుండదు. కానీ మేము ఎవరి కళ్లనైనా చూసి అతను రోమియో అవునా? కాదా? అన్న విషయాన్ని పసిగట్టగలం" అని ఓ పురుష కానిస్టేబుల్ వ్యాఖ్యానించడం గమనార్హం.

ఇద్దరు మహిళా, ఇద్దరు పురుష కానిస్టేబుల్ లతో కూడిన వాహనం తొలుత, ఓ మహిళా కళాశాల వద్దకు వెళ్లింది. అక్కడ గేటుకు సమీపంలో ఉన్న ఓ యువకుడు వీరి ఫస్ట్ టార్గెట్. అతని వద్దకు వెళ్లి, ఇక్కడ ఎందుకు ఉన్నావని ప్రశ్నించగా, తన స్నేహితురాలి కోసం ఎదురుచూస్తున్నట్టు అతను చెప్పాడు. "ఓ అబ్బాయి, అమ్మాయి ఎన్నడూ స్నేహితులు కాదు. మీరు నిజంగా స్నేహితులు అయితే, అమ్మాయి వాళ్ల ఇంటికి వెళ్లు. తల్లిదండ్రుల అనుమతి తీసుకుని అమ్మాయితో మాట్లాడు. ఇక్కడి వీధుల్లో వాతావరణం పాడు చేస్తే ఊరుకోబోము" అని హెచ్చరించి పంపారు.

ఈలోగా, కానిస్టేబుల్ చేతిలోని వైర్ లెస్ లో ఓ కోచింగ్ సెంటర్ కేంద్రం వద్ద వేధింపులు ఎక్కువగా ఉన్నాయని, అక్కడికి ఎస్పీ నేతృత్వంలో వెళుతున్న టీమ్ కు సహాయంగా వెళ్లాలన్న మెసేజ్ వచ్చింది. దీంతో వీరి వాహనం ఆ దిశగా సాగింది. అక్కడి పార్కింగ్ ప్రదేశంలో ఉన్న ఓ యువకుడిని హెచ్చరించిన పోలీసులు ఇంటికి పంపేశారు. ఆ పక్కనే ఓ పుస్తకాల షాపు ముందున్న యువతిని ప్రశ్నించారు. "ఇక్కడేం చేస్తున్నావు? ఏమైనా సమస్య ఉందా?" అని అడుగగా, పోలీసులను చూసిన ఆ యువతి బిక్కచిక్కి, "అటువంటిది ఏమీ లేదు, నా కుమారుడికి స్కూల్ బుక్స్ కొనేందుకు వచ్చాను" అంటూ తన కొడుకును గట్టిగా పట్టుకుంది.

ఆపై అదే ప్రాంతంలో ఉన్న మహిళా కాలేజ్ వద్దకు వీరు వెళ్లారు. కాలేజీ ప్రిన్సిపాల్ తో మాట్లాడారు. కొందరు యువకులు కాలేజ్ బయట నిలబడి వుంటే, వారి ఫోటోలు తీసి, హెచ్చరించి పంపారు. ఈలోగా అసలు 'రోమియో' అన్న పదం ఎలా వచ్చిందన్న చర్చ వీరి మధ్య వచ్చింది. అతను బ్రిటీష్ వ్యక్తని కాసేపు, కాదు, గ్రీక్ వ్యక్తని కాసేపు చర్చ సాగింది. రోమియో, జూలియట్ లు గొప్ప ప్రేమికులే అయినా, ఆ సంస్కృతి ఇంగ్లండ్ లోనో, గ్రీస్ లోనో అయితే సరిపోతుందికానీ, ఇండియాకు కాదని తేల్చారు. తామేమీ మోరల్ పోలీసింగ్ పేరిట ప్రజలను ఇబ్బంది పెట్టాలని చూడటం లేదని, మహిళలకు భద్రత కల్పించడమే తమ లక్ష్యమని నగర ఎస్పీ అలోక్ ప్రియదర్శిని వ్యాఖ్యానించారు.

More Telugu News