: మేమొచ్చాక ఈ పోలీసుల సంగతి ఏంటో చూస్తాం: వీహెచ్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ పార్టీ నేత వి.హనుమంతరావు మండిపడ్డారు. ఉద్యమ నాయకుడినని చెప్పుకునే కేసీఆర్ ధర్నా చౌక్ ను ఎత్తివేస్తామని చెబుతున్నారని... ఏది పడితే అది చేయడానికి ఇదేమన్నా నియంత రాజ్యమా? అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు వస్తాయని కేసీఆర్ భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. అందుకే ధర్నా చౌక్ ను ఎత్తి వేయడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఈ రోజు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడటానికి వచ్చిన వీహెచ్ ను పోలీసులు అడ్డుకున్నారు. సభ నడుస్తున్న సమయంలో మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. దీంతో, పోలీసులతో వీహెచ్ వాగ్వాదానికి దిగారు. పోలీసుల వ్యవహారం బాగోలేదని... డీజీపీ పోలీసు రాజ్యం నడిపిస్తున్నారని మండిపడ్డారు.

రాష్ట్ర ప్రభుత్వమే టార్గెట్ లు పెట్టి మద్యం అమ్మిస్తోందని... మందు తాగి బయటకు రాగానే, పోలీసులు పట్టుకుని కేసులు రాస్తున్నారని... ఇదెక్కడి న్యాయమని వీహెచ్ ప్రశ్నించారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీసుల సంగతి చూస్తామని హెచ్చరించారు. ఓ వైపేమో దానకర్ణుడిలా కేసీఆర్ దానాలు చేస్తుంటే... ఆయన కుమారుడేమో ముక్కు పిండి పన్నులు వసూలు చేస్తున్నారని అన్నారు. గతంలో రూ. 800 ఉన్న ఇంటి పన్ను రూ. 1600కు పెంచారని మండిపడ్డారు. గుళ్లు గోపురాలకు, కుల సంఘాలకు కోట్లకు కోట్లు దానం చేస్తున్న కేసీఆర్... పన్నులు ఎందుకు పెంచుతున్నారని ప్రశ్నించారు.

More Telugu News