: 11 రౌండ్ల అనంతరం తేలిన ఫలితం... ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలో టీఆర్ఎస్ జయకేతనం

మహబూబ్‌ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్‌ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీగా టీఆర్‌ఎస్‌ బలపరిచిన సిట్టింగ్‌ మెంబర్ కాటేపల్లి జనార్దన్‌రెడ్డి మరోసారి గెలుపొందారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించడానికి 9,670 ఓట్లను సాధించాల్సి ఉండగా, గత అర్ధరాత్రి 11వ రౌండు పూర్తయ్యేప్పటికి రెండో ప్రాధాన్యత ఓట్ల సాయంతో ఆయన 9,734 ఓట్లు సాధించారు. నేడు కాటేపల్లికి ధ్రువీకరణ పత్రాన్ని అధికారులు అందించనున్నారు. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా కాటేపల్లి రెండో ప్రాధాన్యత ఓట్లతోనే విజయం సాధించడం గమనార్హం.

కాగా, తొలి ప్రాధాన్యతా ఓట్లలో మిగతా అభ్యర్థులతో పోలిస్తే, కాటేపల్లికి అధిక ఓట్లు లభించినా, గెలుపుకు అవసరమైన ఓట్లను సాధించడంలో ఆయన విఫలమయ్యారు. దీంతో ఎలిమినేషన్ పద్ధతిన రెండో ప్రాధాన్యతా ఓట్ల లెక్కింపు చేపట్టగా, వ్యతిరేక ఓట్లు చీలిన నేపథ్యంలో ఆయన గెలుపు సునాయాసమైంది. తొలి ప్రాధాన్యతా ఓట్లలో కాటేపల్లికి 7,640 ఓట్లురాగా, ఆయన సమీప ప్రత్యర్థి, ఎస్టీయూకు చెందిన ఏవీఎన్‌ రెడ్డికి 3,091, పాపన్నగారి మాణిక్‌రెడ్డి (యూటీఎఫ్‌)కు 3,048 ఓట్లు లభించాయి. మొత్తం పోలైన ఓట్లలో 19,338 ఓట్లు చెల్లగా, గెలుపునకు అందులో సగానికి పైగా, అంటే, 9,670 ఓట్లు రావాల్సి వుంటుంది. రెండో ప్రాధాన్యతా ఓట్ల లెక్కింపులో కాటేపల్లికి అంతకు మించే ఓట్లు లభించాయి.

More Telugu News