: మేట్రిమోనియల్ సైట్స్ ను ఆశ్రయించే వారే లక్ష్యంగా ఘరానా మోసం చేస్తున్న యువతి!

తమ డ్రీమ్ గర్ల కోసం వేచి చూసి, చూసి విసిగి వేసారిపోయిన యువకులు మేట్రిమోనియల్ సైట్స్ ను ఆశ్రయిస్తున్నారు. మైక్రో ఫ్యామిలీలు పెరిగిన నేపథ్యంలో బంధాలు తగ్గిపోయి వివాహ సంబంధాల కోసం మేట్రిమోనియల్ సైట్స్ ను పలువురు ఆశ్రయించక తప్పని పరిస్థితి... దీనిని అస్త్రంగా మలచుకున్న బెంగళూరుకు చెందినా శ్రీలత ఓ యువతి ఘరానా మోసానికి తెరతీసింది. హైదరాబాదుకు చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగినని, తన పేరు సుస్మితగా పేర్కొంటూ, ఓ ఫేక్ ఫోటోతో ఫేక్ ప్రొఫైల్ తో మేట్రిమోనియల్ సైట్ ను ఆశ్రయించింది. దీంతో దేశవ్యాప్తంగా 2,600 మంది ఆమెతో సంబంధం కలుపుకునేందుకు ఉత్సాహం చూపారు. వారిలో కొంత మందిని ఎంచుకున్న ఆమె... వారితో ఫోన్ లో మాటలు కలిపింది. ఇందులో హైదరాబాదులో ఇద్దరిని ఎంచుకుంది. వారితో బాగా కలిసిపోయింది. ఉన్నట్టుండి ఒక రోజు తన పర్సు పోయిందని, తన అకౌంట్ లో 40 వేలు వేయాలని కోరింది. అప్పటికే ఆమెతో పీకల్లోతు మాటల్లో మునిగిన సదరు యువకుడు ఆమె అడిగినంత వేశాడు.

 మరోసారి మళ్లీ అలాంటి కథే చెప్పడంతో అనుమానం వచ్చి సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. దీంతో ఆ అకౌంట్ ను పోలీసులు ఫ్రీజ్ చేశారు. ఇంతలో మరో వ్యక్తి వచ్చి, మేట్రిమోనియల్ సైట్ లో పరిచయమైన యువతి తనను మోసం చేసిందని, ఫిర్యాదు చేశాడు. తన బంధువుకు బాగోలేదంటూ 2 లక్షల రూపాయలు తన ఖాతాలో వేయించుకుందంటూ ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ అకౌంట్ తనదని చెబుతూ ఓ వ్యక్తి సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించాడు. అకౌంట్ నెంబర్ తనదేనని, అయితే వారు చెబుతున్న యువతి ఎవరో తనకు తెలియదని, తనకు ఒక సోదరి ఉందని ఆమె ఫోటోను పోలీసులకు చూపించాడు. దీంతో బాధితులిద్దరూ ఆమెను గుర్తించారు. తమను మోసం చేసిన యువతి తానేనంటూ తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, ఆ యువతిని నిన్న బెంగళూరులో అదుపులోకి తీసుకుని, దర్యాప్తు ప్రారంభించారు.

More Telugu News