: బాహుబలి సినిమాలో చెప్పుకోవడానికి ఏమీ లేదు!: ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణ

'బాహుబలి' సినిమా ఘన విజయం సాధించడంతో... 'బాహుబలి-2' సినిమా కోసం సినీ అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ మాత్రం బాహుబలిపై పెదవి విరిచారు.

బాహుబలి సినిమాను తాను చూశానని... అసలు ఆ సినిమాలో ఏముందని సత్యనారాయణ ప్రశ్నించారు. కథగా చెప్పుకోవడానికి కూడా సినిమాలో ఏమీ లేదని అన్నారు. సినిమా గురించి రెండు ముక్కల్లో సింపుల్ గా చెప్పవచ్చని... భారీ సెట్టింగులు, గ్రాఫిక్స్ మాత్రం ఉన్నాయని చెప్పారు. తమ రోజుల్లో వీటిని ట్రిక్స్ అని పిలిచేవారమని తెలిపారు. ఇప్పుడు వాటిని అందమైన పేరుతో గ్రాఫిక్స్ అని పిలుస్తున్నారని చెప్పారు. ఇలాంటి సినిమాలను హాలీవుడ్ వాళ్లు ఎప్పుడో తీశారని తెలిపారు.

మన మార్కెట్ కు రూ. 500 కోట్లు పెట్టాల్సిన అవసరం ఉందా? అని సత్యనారాయణ ప్రశ్నించారు. ఈ డబ్బుతో 500 సినిమాలు తీయవచ్చని చెప్పారు. ఎంతో ఖర్చు చేసి, భారీ సెట్టింగ్ లు వేసి తీస్తే మన సినిమా స్థాయి పెరిగిపోయినట్టేనా? అని అన్నారు. మొన్నట్లో వచ్చిన 'బిచ్చగాడు' అనే చిన్న సినిమా అద్భుతంగా ఆడిందని కితాబిచ్చారు. గతంలో వచ్చిన ఎన్నో సినిమాలు అద్భుతంగా ఆడాయని... వాటిలో నీతి కూడా ఉందని చెప్పారు.

More Telugu News