: ‘వికల్ప్’ వచ్చేస్తోంది.. ఎక్కాల్సిన రైలు మిస్సయితే.. ఇక ఏ రైలైనా ఎంచక్కా ఎక్కేయొచ్చు!

రైల్వే ప్రయాణికులకు శుభవార్త. అయ్యో! ఎక్కాల్సిన రైలు వెళ్లిపోయిందే.. అని బాధపడాల్సిన పనిలేదు. ఎందుకంటే మీ వద్ద ఉన్న టికెట్‌తో ఆ మార్గంలో వెళ్లే మరే రైలులో అయినా ఎంచక్కా ఎక్కి గమ్యం చేరుకోవచ్చు. మెయిల్, ఎక్స్‌ప్రెస్ లాంటి రైళ్లలో టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు కూడా వచ్చే నెల 1 నుంచి ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు. రాజధాని, శతాబ్ది రైళ్లలో కూడా ప్రయాణించవచ్చు. రైల్వే శాఖ కొత్తగా ప్రవేశపెట్టిన ‘వికల్ప్’ పథకంలో భాగంగా ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. అయితే టికెట్ బుక్ చేసుకునే సమయంలోనే ప్రయాణికులు ఈ ఆప్షన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది.

వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న ప్రయాణికులకు అదే  మార్గంలో వెళ్లే ఇతర రైళ్లలో బెర్త్‌లు కేటాయిస్తారు. ఎక్కాల్సిన రైలు, ఎక్కిన రైళ్ల చార్జీలలో తేడాలున్నా ప్రయాణికుల నుంచి ఎటువంటి చార్జీలు వసూలు చేయరు. అలాగే రీఫండ్ కూడా చేయరు.  పలు కారణాలతో టికెట్ల రద్దు వల్ల రైల్వే శాఖ ఏటా రూ.75000 కోట్లను రీఫండ్ రూపంలో చెల్లిస్తోంది. దీనిని నివారించేందుకే ఈ పథకాన్ని తెరపైకి తెచ్చింది. ఫ్లెక్సీఫేర్ విధానం తర్వాత ప్రీమియం రైళ్లు అయిన రాజధాని, శతాబ్ది, దురంతో , సువిధ లాంటి రైళ్లలో బెర్తులు ఖాళీగా మిగిలిపోతున్నాయి. అదే సమయంలో మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లలో డిమాండ్ ఎక్కువగా ఉంటోంది. దీంతో చాలామంది బెర్తులు దొరక్క ఇబ్బంది పడుతున్నారు. ప్రీమియం రైళ్లలో మిగిలిపోతున్న బెర్తులను నింపాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ‘వికల్ప్’ను తొలుత ఏప్రిల్ 1 నుంచి  ఢిల్లీ–లక్నో, ఢిల్లీ–జమ్మూ, ఢిల్లీ–ముంబై లాంటి మార్గాల్లో అమలు చేయనున్నారు.

More Telugu News