: శశికళ, పన్నీర్ వర్గంలో మొదలైన గుబులు.. ‘రెండాకులు’ దక్కేదెవరికో?

తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు మళ్లీ ఉత్కంఠ మొదలైంది. అటు  శశికళ వర్గం, ఇటు అన్నాడీఎంకే చీలిక వర్గమైన పన్నీర్ శిబిరం చూపు కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) పై పడింది. అన్నాడీఎంకే ఎన్నికల గుర్తు రెండాకులను ఎవరికి కేటాయించాలన్న దానిపై నేడు (బుధవారం) సీఈసీ నిర్ణయం తీసుకోనుంది. దీంతో ఇప్పుడు తమిళనాడు సహా దేశవ్యాప్తంగా అందరి చూపు సీఈసీ వైపు మళ్లింది.

జయలలిత నెచ్చెలి శశికళ చేతికి ప్రభుత్వం చిక్కడంతో కనీసం రెండాకుల గుర్తునైనా తాను దక్కించుకోవాలని పన్నీర్ సెల్వం పట్టుదలగా ఉన్నారు. ఇందుకు సంబంధించిన వ్యూహ, ప్రతి వ్యూహాల్లో మునిగి తేలుతున్నారు. ఈ విషయమై ఆయన ఇప్పటికే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. తమ వద్ద ఉన్న ఆధారాలను, రికార్డులను పన్నీర్ వర్గం ఇప్పటికే  సీఈసీకి సమర్పించింది. చిన్నమ్మ శిబిరం కూడా ఈ విషయంలో సీఈసీకి వివరణలు ఇచ్చింది. తమ వద్ద ఉన్న ఆధారాలను సమర్పించింది. జయ మరణంతో ఖాళీ అయిన ఆర్కేనరగ్‌లో వచ్చే నెలలో ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ‘రెండాకుల’ను దక్కించుకునేందుకు ఎవరికి వారే పోటీపడుతున్నారు. ఈ నేపథ్యంలో సీఈసీ నుంచి ఎలాంటి నిర్ణయం వెలువడుతుందో, రెండాకులు ఎవరికి దక్కుతాయో అన్న ఉత్కంఠ నెలకొంది.

More Telugu News