: వాష్ రూంకి వెళ్లినా ప‌ర్మిష‌న్ తీసుకొని వెళ్లాలా.. అధ్య‌క్షా?: జ‌గ‌న్ చురకలు

‘శాస‌న‌స‌భ నుంచి బ‌య‌టికి వెళితే ప‌ర్మిష‌న్ తీసుకొని వెళ్లాలా అధ్య‌క్షా’? అని ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అన్నారు. ఈ రోజు ఆయ‌న అసెంబ్లీలో మాట్లాడుతూ.. తాను బ‌డ్జెట్‌పై చ‌ర్చ జ‌రుగుతున్న‌ప్పుడు బ‌య‌ట‌కు వెళ్లాన‌ని అధికార పక్షం నేత‌లు విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని, ఆ స‌మ‌యంలో తాను స‌భ‌లో త‌ప్ప‌కుండా ఉండాల్సిన అవ‌స‌రం లేదు క‌దా అని అన్నారు. అస‌లు ఈ స‌భ‌లో అంద‌రికంటే ఎక్కువ స‌మ‌యం కేటాయించింది ఇక్క‌డ ఉన్న తానొక్క‌డినేన‌ని జ‌గ‌న్ అన్నారు. స‌భ‌లో న‌న్ను తిడుతూ మాట్లాడినా, మా నాన్న గురించి మాట్లాడినా తాను స‌భ‌లోనే ఉంటున్నాన‌ని అన్నారు. అధికార ప‌క్షం తీరు బాగోలేదని అన్నారు. తాన‌క్క‌డ ఉంటే ఏంటీ? లేక‌పోతే ఏంటీ? అని జ‌గ‌న్ వ్యాఖ్యానించారు.

వాష్ రూంకి వెళ్లినా ప‌ర్మిష‌న్ తీసుకొని వెళ్లాలా, అధ్యక్షా? అని జగన్ ప్ర‌శ్నించారు. మ‌రి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు కూడా అలాగే వెళ‌తారా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. త‌న‌పై ఏదో ఒక అభాండం వేయాలని, ఏదో ఒక విమ‌ర్శ చేయాలని చూస్తున్నార‌ని అన్నారు. దానికి మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు స‌మాధానం ఇస్తూ... ప్ర‌భుత్వం బ‌డ్జెట్ గురించి స‌మాధానం ఇస్తున్నప్పుడు ప్ర‌తిప‌క్ష పార్టీ అధినేత ఉంటేనే బాగుంటుంద‌ని అన్నారు. జ‌గ‌న్ కావాల‌నే బ‌య‌ట‌కు వెళ్లార‌ని అన్నారు. అనంత‌రం వైసీపీ స‌భ్యులు మెసేజ్ పెడితే మ‌ళ్లీ వ‌చ్చార‌ని ఆరోపించారు. స‌భ‌లో ఉండ‌డం ఆయ‌న బాధ్య‌త అని చెప్పారు.

అనంత‌రం మ‌ళ్లీ మాట్లాడిన జ‌గ‌న్.. య‌న‌మ‌ల మాట్లాడితే కొద్దో గొప్పో లాజిక్ గా ఉంటుంద‌ని తాను అనుకున్నాన‌ని, కానీ ఎమీ లేదని ఎద్దేవా చేశారు. గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం మీద తాను మాట్లాడానని, త‌న‌ ప్ర‌సంగంపై క్లారిఫికేష‌న్లు ఇవ్వాలని అన్నారు. అయితే, బ‌డ్జెట్ పై చ‌ర్చ జ‌రుగుతున్న‌ప్పుడు త‌మ పార్టీ స‌భ్యులు మాట్లాడార‌ని, వారే క్లారిఫికేషన్ ఇస్తార‌ని అన్నారు. ఇక తాను ఇక్క‌డ ఉన్నా లేకున్నా ఏంట‌ని అన్నారు. ఓ రీజ‌న్ లేకుండా త‌న‌పై అభాండాలు వేస్తున్నార‌ని అన్నారు.

More Telugu News