: టీచర్ ఎమ్మెల్సీల్లో టీడీపీకి ఎదురుదెబ్బ... పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల స్థానంలో 11 వేలకు పెరిగిన వైకాపా అభ్యర్థి ఆధిక్యం

స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ సాధించిన అధికార తెలుగుదేశం, టీచర్, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల విషయానికి వస్తే చతికిలబడింది. ఆ పార్టీ నిలిపిన వారంతా ఓటమి దిశగా పయనించారు. బీజేపీకి కేటాయించిన ఒక్క ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్థానం మినహా మిగతా అన్ని చోట్లా టీడీపీకి పరాజయం తప్పేలా లేదు. ఈ స్థానంలో పీవీఎస్ మాధవ్ ఆరో రౌండు కౌంటింగ్ ముగిసేసరికి 5,594 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తూర్పు రాయలసీమ నియోజకవర్గానికి వైసీపీ మద్దతుతో నిలబడిన పీడీఎఫ్‌ అభ్యర్థి విఠపు బాలసుబ్రహ్మణ్యం విజయం సాధించగా, పశ్చిమ రాయలసీమ నియోజకవర్గం నుంచి ఎస్టీయూ అభ్యర్థి కత్తి నరసింహారెడ్డి గెలిచిన సంగతి తెలిసిందే.

ఇక పట్టభద్రుల పశ్చిమ రాయలసీమ (చిత్తూరు, అనంతపురం జిల్లాలు) నియోజకవర్గంలో ఐదో రౌండు కౌంటింగ్ ముగిసేసరికి వైకాపా అభ్యర్థి గోపాల్ రెడ్డి, తన సమీప టీడీపీ అభ్యర్థి కేజే రెడ్డిపై 11 వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇక్కడ వైకాపా అభ్యర్థి గెలుపు దాదాపు ఖాయమైనట్టే. ఓట్ల లెక్కింపు ఈ సాయంత్రంలోగా పూర్తవుతుందని అంచనా.

More Telugu News