: ముస్లింలకు ఇచ్చిన మాటను కేసీఆర్ నిలబెట్టుకోనున్నారా...?

తాము అధికారంలోకి వస్తే ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించిన సీఎం కేసీఆర్ ఆ హామీ నిలబెట్టుకోనున్నారా...? అంటే, అవుననే సమాధానం వినిపిస్తోంది. ముస్లింలకు రిజ్వేషన్లు కల్పించే బిల్లును ప్రస్తుత శాసనసభ బడ్జెట్ సమావేశాల్లోనే ప్రవేశపెట్టేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం సన్నద్ధమైనట్టు కనిపిస్తోంది. ఇప్పటికే ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ ప్రకటించగా ఈ రోజు జరిగే కేబినెట్ భేటీలో ఏంటన్నది తేలిపోనుంది. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నేటి సాయంత్రం జరగనుంది. ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక బిల్లులపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. మైనారిటీ, గిరిజన రిజర్వేషన్ల బిల్లుతో పాటు ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్ట సవరణ, సెంట్రల్ క్లినికల్ ఎస్టాబ్లిష్ మెంట్ యాక్ట్ ను రాష్ట్రంలో అమలు చేసేందుకు ఉద్దేశించిన బిల్లు, రాష్ట్ర మార్కెటింగ్ చట్టానికి సంబంధించిన బిల్లులకు ఆమోదం తెలిపే అవకాశాలున్నాయని అధికార వర్గాలు తెలిపాయి. 

More Telugu News