: డ్రైవర్ హత్య కేసు.. పోలీసుల అదుపులో ఐఏఎస్ అధికారి కొడుకు.. తన ఫోన్ ఇవ్వకపోవడంతో వాగ్వాదానికి దిగిన ఐఏఎస్ అధికారి!

ఐఏఎస్ అధికారి వెంకటేశ్వర్లు కారుకు డ్రైవర్ గా పని చేస్తున్న నాగరాజు హత్య కేసు విచారణ జరుగుతోంది. ఈ హత్య కేసుకు సంబంధించి సదరు అధికారి కొడుకు వెంకట్ పై అనుమానాలు ఉండటంతో నిన్న రాత్రి అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు విచారణ నిమిత్తం హైదరాబాదు, జూబ్లీహిల్స్ పోలీసులు ఐఏఎస్ అధికారి వెంకటేశ్వర్లను పిలవడంతో ఆయన వెళ్లారు. విచారణలో భాగంగా ఆయన సెల్ ఫోన్ ను పోలీసులు తీసుకున్నారు.

దీంతో, పోలీసులకు, అధికారికి మధ్య వాగ్వాదం మొదలైంది. తన ఫోన్ తనకు ఇస్తే, తాను వెళ్లిపోతానని ఆ అధికారి గొడవకు దిగారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, యూసఫ్ గూడలోని సాయి కల్యాణ్ అపార్టుమెంట్ లో డ్రైవర్ నాగరాజును వెంకటే హత్య చేసినట్టు తాము గుర్తించామని చెప్పారు. ఈ కేసు విచారణ నిమిత్తం వెంకట్ తండ్రి వెంకటేశ్వర్లును విచారిస్తుండగా ఫోన్ విషయమై ఆయన వాగ్వాదానికి దిగారని చెప్పారు. కాగా, మృతుడు నాగరాజు కుటుంబీకులు, బంధువులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. నాగరాజును హతమార్చిన వెంకట్ ను శిక్షించాలని, తమ కుటుంబాన్ని ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు.

More Telugu News