: రూ. 25 లక్షలు దోపిడీ చేసిన ఆమ్ ఆద్మీ యువనేత... అరెస్ట్

ఆమ్ ఆద్మీ పార్టీ యువనేతను రూ. 25 లక్షల దోపిడీ కేసులో పోలీసులు అరెస్ట్ చేయడం దేశ రాజధానిలో కలకలం రేపింది. జఫ్రాబాద్ ప్రాంతానికి చెందిన ఆప్ యూత్ వింగ్ అధ్యక్షుడు నజీబ్ (25)ను పోలీసులు నిన్న అరెస్ట్ చేశారు. అతనితో పాటు దోపిడీలో పాల్గొన్న మరో ఐదుగురిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ దోపిడీ ఘటన 12వ తేదీన మౌజ్ పూర్ సమీపంలోని కృష్ణ గాలి పరిధిలో జరిగిందని, తుపాకి కాల్పులు జరుపుతూ, ఓ వ్యాపారవేత్తను బెదిరించిన ఈ బృందం రూ. 25 లక్షలతో పాటు మొబైల్ ఫోన్, ఇతర డాక్యుమెంట్లను దొంగిలించారని, ఈ ఘటనలో దారిన పోతున్న వారికి గాయాలు అయ్యాయని తెలిపారు.

స్థానికులు దోపిడీ బృందంలోని ఓ వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించగా, అతన్ని విచారించి మిగిలిన వారిని అరెస్ట్ చేశామని, రూ. 16.06 లక్షల నగదుతో పాటు, దేశవాళీ తపంచా, వారు గతంలో దొంగిలించిన బైక్ ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మరో 20 కేసుల్లో వీరికి సంబంధముందని పోలీసు వర్గాలు వెల్లడించాయి. కాగా, నిందితుడు నజీబ్ తో తమకు సంబంధం లేదని ఆప్ ప్రకటించింది. ఢిల్లీ పోలీసులు ఏ నేరం జరిగినా తమ పార్టీతో ముడిపెట్టడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారని ఆప్ నేత వందనా సింగ్ ఆరోపించారు.

More Telugu News