: ఆస్ట్రేలియాకు పాకిన జాత్యహంకార దాడులు... భారతీయుడిపై దాడి

అమెరికాలో ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత విదేశీయులపై ముఖ్యంగా భారతీయులపై జాత్యహంకార దాడులు పెరిగాయి. ఇప్పుడు ఈ దాడులు ఆస్ట్రేలియాకు కూడా పాకాయి. ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ లో ఓ భారత క్రైస్తవ మత ప్రచారకుడిపై విద్వేష దాడి జరిగింది. ఆయనపై 72 ఏళ్ల ఆస్ట్రేలియన్ దాడి చేశాడు. జాత్యహంకారంతోనే ఈ దాడి జరిగిందని స్థానిక మీడియా వెల్లడించింది. ఈ ఘటన నిన్న జరిగింది.

చర్చి ఫాదర్ టొమీ కళాథూర్ మథ్యూ (48)పై దుండగుడు కత్తితో దాడి చేశాడని.. అతడిని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. మథ్యూ హిందూ లేదా ముస్లిం అయ్యుంటాడన్న కారణంతో, ఉద్దేశపూర్వకంగానే ఈ దాడికి పాల్పడ్డానని నిందితుడు ఒప్పుకున్నాడు. అయితే, నిందితుడు బెయిల్ పై బయటకు వచ్చాడు. జూన్ 13న బ్రాడ్ మీడొస్ కోర్టులో అతనిని విచారణ నిమిత్తం హాజరుపరచనున్నారు. మరోవైపు, మథ్యూకు ప్రాణాపాయం తప్పింది. అతను ప్రస్తుతం ఆసుపత్రిలో కోలుకుంటున్నాడు. ఈ విద్వేష దాడితో ఆస్ట్రేలియాలో ఉన్న భారతీయులు కలవరపాటుకు గురవుతున్నారు.

More Telugu News