: రిజర్వేషన్లు కోరుతూ దేశ రాజధానిపై పడ్డ జాట్లు... నిలిచిన మెట్రో సేవలు, ప్రజల తీవ్ర ఇబ్బందులు!

తమకు తక్షణం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ, గడచిన 50 రోజులుగా నిరసనలు తెలుపుతున్న జాట్ వర్గీయులు, నేడు ఢిల్లీ మెట్రో సర్వీసుల బంద్ కు పిలుపునివ్వడంతో, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముందుజాగ్రత్త చర్యగా, ఢిల్లీ శివార్లలోని 12 స్టేషన్లను గత రాత్రి 8 గంటల నుంచి మూసివేసిన అధికారులు, పలు ముఖ్యమైన రూట్లలో ఈ ఉదయం నుంచి మెట్రో సేవలను నిలిపివేశారు. విద్య, ఉద్యోగాల్లో జనాభా సంఖ్యకు తగ్గట్టుగా జాట్ వర్గీయులు రిజర్వేషన్లను డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. రేపటి నుంచి జంతర్ మంతర్ వద్ద నిరసనలకు ఏఐజేఏఎస్ఎస్ (ఆల్ ఇండియా జాట్ ఆకర్షన్ సంగ్రామ్ సమితి) పిలుపునివ్వడంతో, ఇప్పటికే వందలాది మంది ఢిల్లీ చేరుకున్నట్టు తెలుస్తోంది.

దీంతో అప్రమత్తమైన అధికారులు జాట్ల కదలికలపై నిఘా పెట్టారు. రాజీవ్ చౌక్, పటేల్ చౌక్, సెంట్రల్ సెక్రటేరియేట్, ఉద్యోగ్ భవన్, లోక్ కల్యాణ్ మార్గ్, జన్ పథ్, మండీ హౌస్, బరకంభా రోడ్, ఆర్కే ఆశ్రమ్ మార్గ్, ప్రగతి మైదాన్, ఖాన్ మార్కెట్, శివాజీ స్టేడియం స్టేషన్లను మూసివేయడంతో ఈ ప్రాంతంలో జనజీవనానికి ఇబ్బందులు ఏర్పడ్డాయి. వీటితో పాటు ఎల్లో లైన్ స్టేషన్లయిన గుర్ గ్రాం ప్రాంతంలోని మెట్రో స్టేషన్లు, బ్లూ లైన్ స్టేషన్లయిన నోయిడా ప్రాంత స్టేషన్లు, వైలెట్ లైన్ స్టేషన్లయిన ఫరీదాబాద్ పరిధిలోని స్టేషన్లలో మెట్రో సేవలను ఆపినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. తదుపరి ఆదేశాలు అందే వరకూ ఈ మార్గాల్లో మెట్రోలు తిరగబోవని అధికారులు తెలిపారు.

More Telugu News