: 312 మంది ఎమ్మెల్యేల్లో సీఎం స్థాయి తెలివి తేటలు ఒక్కరికీ లేవా?.. ఆదిత్యనాథ్ ఎంపికపై కాంగ్రెస్ మండిపాటు

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆదిత్యనాథ్‌ను ఎంపిక చేయడంపై కాంగ్రెస్ మండిపడింది. గెలిచిన 312 మంది బీజేపీ ఎమ్మెల్యేల్లో ముఖ్యమంత్రి స్థాయి తెలివితేటలు ఉన్నవారు ఒక్కరు కూడా లేరా? అని ప్రశ్నించింది. ఆదిత్యనాథ్ ఎంపిక లౌకికవాదంపై అతిపెద్ద దాడి అని అభివర్ణించింది. హిందూయిజాన్ని రాష్ట్ర ప్రజలపై రుద్దేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని సీనియర్ నేత వీరప్ప మొయిలీ ఆరోపించగా, యూపీలో సీఎం స్థాయి వ్యక్తులు ఒక్కరూ లేరని కాంగ్రెస్ ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా ఎద్దేవా చేశారు.

మరోవైపు రాష్ట్ర నేతలు కూడా ఆదిత్యనాథ్ ఎంపికను తప్పుబడుతున్నారు. యోగి ఎంపికతో లౌకికవాదం, ప్రజాస్వామ్యానికి ప్రమాదం పొంచి ఉందని సీపీఐ నేత నారాయణ విమర్శించారు. యూపీలో ‘కొత్త భారత్’ను నిర్మించేందుకుకే యోగిని మోదీ ఎంపిక చేశారని ఎంఐఎం నేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ట్వీట్ చేశారు. అయితే, ప్రతిపక్షాల విమర్శలను బీజేపీ కొట్టిపడేస్తోంది. ఆదిత్యనాథ్‌ను హిందూత్వవాదిగా మీడియా చిత్రీకరించినప్పటికీ నిజానికి ఆయన అభివృద్ధికి మారుపేరని పేర్కొంది.

More Telugu News