: బీజేపీని భయపెడుతున్న ఉత్తరప్రదేశ్... ఆదిత్య నాథ్ ఎలా ఈదుతారో?

తాము కోరుకున్నట్టుగా ఉత్తరప్రదేశ్ ప్రజలు బంపర్ మెజారిటీతో అధికారాన్ని కట్టబెట్టారు.. అందరూ కోరుకున్నట్టుగా ఫైర్ బ్రాండ్ యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి కాబోతున్నారు. అంతవరకూ బాగానే వుంది. అయితే, ఇప్పుడు బీజేపీని కలవరపెడుతున్న అంశాలు వేరే వున్నాయి. రాష్ట్రంలోని సమస్యలు, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఆ పార్టీని ఆందోళనకు గురి చేస్తున్నాయి. సుమారు 120 కోట్ల భారతావనిలో అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ అన్న సంగతి తెలిసిందే. ఉత్తరప్రదేశ్ జనాభా 20 కోట్లు...అంటే ఈ జనాభా మొత్తం బ్రెజిల్‌ జనాభాతో సమానం. కాగా, యూపీ ఆర్థిక వ్యవస్థ ఖతార్‌ దేశ ఆర్థిక వ్యవస్థతో సమానం.

ఉత్తరప్రదేశ్ స్థూల జాతీయోత్పత్తి ఆఫ్రికా దేశమైన కెన్యాతో సమానం. మరి పేదరికం విషయానికి వస్తే... ఆఫ్రికా ఖండంలోని అత్యంత దుర్భర దారిద్య్రం అనుభవిస్తున్న దేశాలను కూడా వెనక్కి నెట్టి అగ్రస్థానం సంపాదిస్తుంది. ఎందుకంటే యూపీలో వైద్యారోగ్యం దుర్భర దారిద్ర్యాన్ని అనుభవిస్తోంది. యూపీలో శిశుమరణాలు ఎక్కువ. పుట్టిన ప్రతి 1000 మందిలో 64 మంది పుట్టిన కాసేపటికే మరణిస్తున్నారంటే ఇక్కడి వైద్యారోగ్య పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. అంతే కాదు, ఇక్కడ పుట్టిన ప్రతి ఇద్దరు పిల్లల్లో ఒక్కరికి మాత్రమే సరైన వ్యాధి నిరోధక టీకాలు అందుతున్నాయంటే యూపీలో ఆరోగ్యం ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు.

 యూపీలో ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు అవసరమైన వైద్యనిపుణుల్లో 16 శాతం మాత్రమే అందుబాటులో ఉన్నారని చెప్పుకోవాల్సి రావడం బాధాకరం. నర్సింగ్ సిబ్బంది కూడా కేవలం 50 శాతం మాత్రమే అందుబాటులో ఉంది. పౌష్టికాహార లోపంతో తక్కువ బరువుతో పుడుతున్న పిల్లల సంఖ్య 39.5 శాతం. ఇలా చెప్పుకుంటే విద్య, ఇతర సమస్యలు కొండవీటి చాంతాడంత అవుతాయి. ఈ సమస్యలను రేపు మధ్యాహ్నం ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్న ఆదిత్యనాథ్ ఎలా ఎదుర్కొంటారన్న ఆసక్తి అందర్లోనూ నెలకొంది.

More Telugu News