: పాకిస్థాన్ లో సిక్కు మతానికి చోటు లేకుండా చేసే కుట్ర!.. సిక్కుల ఆందోళన!

పాకిస్థాన్ లో ఏకంగా ఓ మతానికే చోటు లేకుండా చేసే ప్రయత్నం జరుగుతోంది. పాక్ ప్రజల భవిష్యత్తును నిర్ణయించే జనాభా లెక్కల్లో సిక్కు మతానికి స్థానం లేకుండా చేశారు. ఇది ముమ్మాటికీ కుట్రపూరితమేనని సిక్కు మతస్తులు ఖైబర్ ఫష్తూన్ లో ఆందోళనకు దిగారు. జనాభా లెక్కల్లో హిందూ, క్రీస్టియన్ తదితర మతాలను పేర్కొన్నప్పటికీ సిక్కు మతాన్ని మాత్రం ఎందుకు చేర్చలేదని ప్రశ్నిస్తూ ఖైబర్ ఫష్తూన్ లో సిక్కులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇది ముమ్మాటికీ సిక్కులకు, ప్రభుత్వానికి మధ్య ఘర్షణను సృష్టిస్తుందని సిక్కులు చెప్పారు.

ఆందోళనల సందర్భంగా పాకిస్థాన్ మైనారిటీల కూటమి (ఖైబర్ ఫష్తూన్) అధ్యక్షుడు రాడేశ్ సింగ్ మాట్లాడుతూ... జనాభా లెక్కల పత్రంలో సిక్కు మతం మినహా అన్ని మతాలు ఉన్నాయని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉన్న సిక్కు మతాన్ని దరఖాస్తు పత్రంలో పేర్కొనకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. దేశ భవిష్యత్తును నిర్ణయించే జనాభా లెక్కల్లో తమను విస్మరించడం దారుణమని అన్నారు. తమను అందరితో పాటు సమాన పౌరులుగా గుర్తించాలని, తమ హక్కులను కాపాడాలని, లేకపోతే నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తామని హెచ్చరించారు. జనాభా లెక్కలను బహిష్కరిస్తామని వార్నింగ్ ఇచ్చారు.

More Telugu News