: రిజర్వ్ సీటు ఇవ్వనందుకు టీఎస్ ఆర్టీసీకి ఫైన్.. ప్రయాణికుడికి 10 వేలు చెల్లించాలంటూ కోర్టు తీర్పు!

తెలంగాణ ఆర్టీసీకి వినియోగదారుల న్యాయస్థానం పది వేల రూపాయల జరిమానా విధించింది. సీనియర్ సిటిజన్స్ కు ప్రతి ఆర్టీసీ బస్సులో ఒక సీటు కేటాయించి ఉంటుంది. అంతే కాకుండా వయసు మళ్లిన వారుంటే ప్రయాణికుల అనుమతితో వారిని ఏదో ఒక సీట్లో కూర్చోబెట్టవచ్చు. అయితే ఈ నిబంధనలు పాటించడం అరుదుగా జరుగుతుంటుంది. సంగారెడ్డి ప్రశాంత్‌ నగర్‌ కు చెందిన న్యాయవాది నాగేందర్‌ (68) దీనిపైనే పోరాటం చేశారు. ఆయన ఒక రోజు టీఎస్ఆర్టీసీ బస్సులో 20 రూపాయల టికెట్ తీసుకున్నారు. తరువాత బస్సులో ఆయన కూర్చునేందుకు సీటు వద్దకు రాగా, సీనియర్ సిటిజన్స్ సీటు ఫుల్ అయిపోయింది.

కండక్టర్ అందులో కూర్చున్న వారిని లేపే ప్రయత్నం చేయలేదు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన న్యాయస్థానంలో కేసు వేశారు. అనంతరం తన కేసును తానే వాదించుకున్నారు. కోర్టు ఆయన వాదనతో ఏకీభవించడంతో...టీఎస్ ఆర్టీసీని పలు ప్రశ్నలు అడిగింది. ఆర్టీసీ సీనియర్ సిటిజన్స్ పట్ల సరైన విధంగా వ్యవహరించడం లేదని మండిపడింది. సీనియర్ సిటిజన్స్ పట్ల ఆర్టీసీ చూపిస్తున్న నిర్లక్ష్యానికి 20 రూపాయల టికెట్ కు పదివేల రూపాయలు జరిమానా విధిస్తున్నట్టు తెలిపింది. ఈ మొత్తాన్ని ప్రయాణికుడికి చెల్లించాలని న్యాయస్థానం టీఎస్ ఆర్టీసీని ఆదేశించింది. 

More Telugu News