: రాహుల్ గాంధీ పని చేయాలి.. లేకపోతే లాభం లేదు: దిగ్విజయ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు

ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకోవడం, గోవా, మణిపూర్ లలో ఎక్కువ స్థానాలను గెలుచుకున్నప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోవడం కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. ముఖ్యంగా గోవాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోవడంపై పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో, ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ దిగ్విజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

తమ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అంకిత భావంతో, దృఢ నిశ్చయంతో పనిచేయాల్సిన సమయం ఆసన్నమైందని ఈ సందర్భంగా దిగ్విజయ్ వ్యాఖ్యానించారు. ఆయన సరిగా పనిచేయడం లేదని... ఇదే విషయాన్ని రాహుల్ కు తాను పలుసార్లు చెప్పానని... ఇప్పుడు కూడా అదే చెబుతున్నానని అన్నారు. ఆధునిక మార్పులకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీని తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రస్తుతం తమకు కొత్త కాంగ్రెస్, కొత్త ప్రణాళిక, కొత్త మార్గ సూచిక, వినూత్నమైన ప్రచార శైలి కావాలని అన్నారు. మధ్య తరగతి ప్రజల ఆంకాంక్షలకు అనుగుణంగా ప్రణాళికలను రచించుకోవాలని చెప్పారు. ఆ పనిని పార్టీ అధిష్ఠానమే చేయాలని, రాహుల్ గాంధీనే చేయాలని స్పష్టం చేశారు.

More Telugu News